బాబ్రీ మసీదు కూల్చివేతపై పోస్ట్.. ఎంవీఏ నుంచి ఎస్పీ ఔట్
ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీకి వారికి తేడా ఏమున్నది? మహా వికాస్ అఘాడీ నుంచి మేం వైదొలుగుతున్నామన్న ఎస్పీ మహారాష్ట్ర చీఫ్ అబు అజ్మి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మహా వికాస్ అఘాడీ పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి శివసేన (యూబీటీ) నేత ఒకరు చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఆ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీ తీవ్రంగా మండిపడింది. కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నది.
బాబ్రీ మసీదు కూల్చివేతపై శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. 'ఈ పనిచేసిన వారి పట్ల నేను గర్వంగా ఉన్నా' అని శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను రాసుకొచ్చారు. అటు ఓ వార్త పత్రికలోనూ దీనిపై ప్రకటన ఇచ్చారు. ఈ పరిణామాలపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీకి వారికి తేడా ఏమున్నది? మేం ఎందుకు ఇంకా వారితో కలిసి ఉండాలి? మహా వికాస్ అఘాడీ నుంచి మేం వైదొలుగుతున్నాం. ఇదే విషయాన్ని పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లామని ఎస్పీ మహారాష్ట్ర చీఫ్ అబు అజ్మి వెల్లడించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఎంవీఏ కూటమితో కలిసి పోటీ చేసిన విషయం విదితమే. ఆపార్టీ రెండు అసెంబ్లీ స్థానాలను కూడా దక్కించుకున్నది. ఎస్పీ ప్రకటనపై శివసేన (యూబీటీ) ఇంకా స్పందించలేదు.
హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఫలితాలను చవిచూసింది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో విభేదాలు బహర్గతమవుతున్నాయి. ఇప్పటికే కూటమి పనితీరుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెదవి విరిచారు. అవకాశం వస్తే ఇండియా కూటమికి నేతృత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలనని ఆమె అన్నారు. దీదీ వ్యాఖ్యలపై కూటమిలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎస్పీ మాత్రం ఆమెకు మద్దతు ప్రకటించగా.. కాంగ్రెస్ వ్యతిరేకించింది.