Telugu Global
National

కేజ్రీవాల్ పై పోటీ చేసేది ఎవరంటే?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

కేజ్రీవాల్ పై పోటీ చేసేది ఎవరంటే?
X

దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్‌ ప్రకటించనప్పటికీ రాజకీయ వేడి మాత్రం రాజుకున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నాయి. తాజాగా బీజేపీ ఢిల్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు పోటీగా మాజీ ఎంపీని బరిలోకి దింపింది.

తొలి జాబితాలో 29 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ పర్వేశ్‌ వర్మ పేరును ఖరారు చేసింది. ఇదే స్థానం నుంచి ఆప్‌ నేత కేజ్రీవాల్‌ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ కూడా ఈ స్థానానికి మాజీ సీఎం షీలాదీక్షిత్‌ కుమారుడు సందీపక్ష దీక్షిత్‌ పేరును ప్రకటించింది. దీంతో ఈ సారి ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం పోరు ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడైన పర్వేశ్‌ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డుస్థాయిలో 5.78 లక్షల ఓట మెజారిటీతో గెలుపొందారు. ఢిల్లీ చరిత్రలో ఓ లోక్‌సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజారిటీ ఇదే కావడం గమనార్హం.

మరోవైపు ఢిల్లీ సీఎం ఆతిశీకి పోటీగా కల్కాజీ స్థానం నుంచి మరో మాజీ ఎంపీ రమేశ్‌ బిధూడీని నిలబెట్టింది. ఇటీవల ఆప్‌ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌కు ఈ ఎన్నికల్లో టికెట్‌ దక్కింది. బిజ్వాసన్‌ నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించిది. ఢిల్లీ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ అరవింద్‌ సింగ్లీ లవ్లీ కూడా గత ఏడాది కాషాయ పార్టీలో చేరగా.. తాజా జాబితాలో గాంధీనగర్‌ స్థానం నుంచి నిలబెట్టింది.

First Published:  4 Jan 2025 2:39 PM IST
Next Story