కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై విపక్షాల నిరసన
లోక్‌సభ వెల్‌లోకి వచ్చి నిరసన, నినాదాలు.. స్పీకర్ ఆగ్రహం
కుంభమేళాలో మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను పార్లమెంట్‌లో విపక్షాలు లేవనెత్తాయి. సోమవారం ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. విపక్ష సభ్యులు లోక్‌సభ వెల్‌లోకి వచ్చి నిరసన, నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనను లోక్‌సభ స్పీకర్ తీవ్రంగా ఖండించారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయెద్దని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ ఘటన గురించి ప్రస్తావించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ .. నినాదాలు ఆగలేదు. ఈ పరిస్థితుల మధ్యే లోక్‌సభ కార్యకలాపాలు కానసాగుతున్నాయి.
మహాకుంభమేళా తొక్కిసలాటలో ఎక్కువ మంది చనిపోయినప్పటికీ తక్కువ చూపించారని విపక్షాలు ఆరోపించాయి. జరిగిన దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షసభ్యులు డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై మాత్రమే చర్చించాలని, సభా కార్యకలాపాలకు ఆటంకం కలింగించవద్దని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు విపక్ష ఎంపీలను కోరారు. రాజ్యసభలోనూ మృతుల వివరాలను బైట పెట్టాలని ఎస్పీ సహా విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.