జమ్మూకశ్మీర్ లో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లకు గాను నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, సీపీఎం, జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీలతో కూడిన కూటమి 49 సీట్లు గెలుచుకొని విజయడంకా మోగించింది. వీరిలో 42 మంది ఎమ్మెల్యేలు నేషనల్ కాన్ఫరెన్స్ నుంచే గెలుపొందారు. బీజేపీ 29 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) మూడు సీట్లకే పరిమితం అయ్యింది. మహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీకి ఓటమి ఎదురైంది. కూటమికి స్పష్టమైన ఆధిక్యం దక్కడంతో ఒమర్ అబ్దుల్లాను ముఖ్యమంత్రిగా ప్రకటించారు. త్వరలోనే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.