నేషనల్ కాన్ఫరెన్స్ ఎల్పీ నేతగా ఒమర్ అబ్దుల్లా
ఏకగ్రీవంగా ఎన్నుకున్న శాసనసభ పక్షం
నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభ పక్షనేతగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన శాసన సభపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఒమర్ అబ్దుల్లాను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఆయన శుక్రవారం లేదా శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలోని కూటమికి 48 దక్కాయి. ఇందులో ఒక్క నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచే 42 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. బీజేపీ నుంచి 29 మంది ఎమ్మెల్యేలు గెలువగా ఆ పార్టీతో ముగ్గురు ఇండిపెండెంట్లు జత కట్టారు. దీంతో బీజేపీ బలం 32కు పెరిగినట్టు అయ్యింది. తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరించాలని కోరుతూ కేంద్రానికి తీర్మానం చేసి పంపిస్తామని ఒమర్ అబ్దుల్లా ఇదివరకే ప్రకటించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడనున్న తొలి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇదే కావడం విశేషం.