ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత
గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన హర్యానా మాజీ సీఎం
హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1989-2005 వరకు హర్యానాకు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.ఇంట్లో చౌతాలకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ చౌతాలా ప్రాణాలను కాపాడలేకపోయారు . ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన హర్యానాకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి (1989-2005) రికార్డు నెలకొల్పారు.
1935 జనవరిలో ప్రముఖ రాజకీయ కుటుంబంలో చౌతాలా జన్మించారు. దేశానికి ఆరో డిప్యూటీ ప్రధానిగా పనిచేసిన దేవీలాల్ కొడుకే ఓం ప్రకాశ్ చౌతాలా. భారత రాజకీయాల్లో బలమైన నేతగా పేరొందిన చౌతాలా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన ఎన్డీఏలోనూ, థర్డ్ ఫ్రంట్ లోనూ భాగస్వామిగా ఉన్నారు. 2009 లో యూపీఏ, ఎన్డీఏ యేతర కూటములకు వ్యతిరేకంగా ఏర్పడిన థర్డ్ ఫ్రంట్ లో కీలక పాత్ర పోషించారు.
1999-2000 మధ్య కాలంలో హర్యానాలో టీచర్ల నియామకానికి సంబంధించిన కుంభకోణంలో 2013లో 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. తొమ్మిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష తర్వాత జూలై 2021లో తీహార్ జైలు నుండి విడుదలయ్యాడు.