ముంబాయి వెళ్లే ఈ వాహనాలకు నో టోల్ ఫీజు
ఈ వారంలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సీఎం ఏక్‌నాథ్ శిండే కీలక ప్రకటన
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానున్న వేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం ఏక్‌నాథ్ శిండే టోల్ ఫీజుల వసూలుకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించారు. ముంబాయికి వెళ్లే మార్గంలో మొత్తం ఐదు టోల్ బూత్‌ల వద్ద లైట్ మోటార్ వెహికిల్స్‌కు టోల్ ఫీజులను వసూలు చేయబోమని తెలిపారు. నేటి అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి రానున్నది. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకున్నది.
సోమవారం సీఎం ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. థానే నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నశిండే గతంలో చాలాసార్లు టోల్ వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఇప్పుడు వాటిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏక్‌నాథ్ శిండే ప్రభుత్వానికి ఇదే చివరి మంత్రివర్గ సమావేశం. అలాగే మహారాష్ట్ర స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ పేరు మార్చుతూ మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కన్నుమూసిన రతన్ టాటా గౌరవార్థం ఈ వర్సిటీకి ఆయన పేరు పె్టారు. రతన్ టాటా స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీగా దీన్ని మార్చారు.
ఆ ఐదు టోల్‌ప్లాజాల వద్ద
తాజా నిర్ణయంతో వాహనదారులకు ఐదు టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుముల నుంచి విముక్తి లభించనున్నది. దహిసర్, ములుంద్, వాషి, ఐరోలి, తిన్హంత్ నాకాల్లో కార్లు, ఎస్‌యూవీలు ఎలాంటి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ప్రస్తుతం టోల్ ఫీజుగా రూ. 45 వసూల చేస్తున్నారు. ముంబయి నగరంలోకి చిన్న వాహనాలతో ప్రవేశించే రోజు వారి ప్రయాణికులకు ఇది ఊరట కలిగించే నిర్ణయమని పలువురు పేర్కొంటున్నారు.
ఇది పొలిటికల్ స్టంట్
మరోవైపు ఏక్‌నాథ్ శిండే ప్రభుత్వం టోల్ రుసుములు తొలిగిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇది పొలిటికల్ స్టంట్ అంటూ విమర్శించాయి. మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ఆరోపించారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈ వారం ప్రకటించే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ రంగం సిద్ధం చేస్తున్నది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 45 అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా జరపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.