Telugu Global
National

ఏ మతమూ కాలుష్యాన్ని ప్రోత్సహించదు

టపాసులు కాల్చడంతో కాలుష్య పొగ ఢిల్లీని కమ్మేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఏ మతమూ కాలుష్యాన్ని ప్రోత్సహించదు
X

బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ.. దీపావళి సమయంలో ఢిల్లీలో ప్రజలు టపాసులు కాల్చడంతో కాలుష్య పొగ ఢిల్లీని కమ్మేసింది. దీనిపై ఇప్పటికే తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ మతమూ కాలుష్యాన్ని ప్రోత్సహించదని వ్యాఖ్యానించింది. టపాసుల అమ్మకాలు, వాటిని కాల్చడాన్ని అరికట్టడానికి ఢిల్లీ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కాలుష్యాన్ని సృష్టించే చర్యలను ఏ మతమూ ప్రోత్సహించదు. ఇదే తరహాలో టపాసులు పేలిస్తే.. ఆరోగ్యంగా జీవించడానికి పౌరులకు కల్పించిన ప్రాథమికహక్కును ఉల్లంఘించినట్లే అవుతుందని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. నవంబర్‌ 25లోగా వ్యాపారవర్గాలను సంప్రదించి శాశ్వతంగా బాణసంచాను నిషేధించే విషయంపై ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని సూచించింది. నిషేధాన్ని పక్కగా అమలు చేయడానికి ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రా మెటీరియల్‌ మాత్రమే సీజ్‌ చేసి కంటి తుడుపు చర్యలకు పాల్పడ్డారంటూ మండిపడింది.

దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరగడంపై గత విచారణలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. టపాసులపై నిషేధం అమలు చేయలేదని వార్తలు వచ్చాయి. కాలుష్యాన్ని నివారించడానికి నిషేధాన్ని ముఖ్యమైన చర్యగా భావించాం. అసలు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిషేధాన్ని ఉల్లంఘించే వారి స్థలాలను సీల్‌ చేయడం వంటి చర్యలు అవసరమని వ్యాఖ్యానించింది. 2025 నాటి దీపావళికైనా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చర్యలు ఉండాలని సూచించింది.

చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ రాజధాని లో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా బాణసంచా తయారీ, విక్రయాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమల్లో ఉంటుంది. బాణసంచా ఆన్‌లైన్‌లో అమ్మకాలు, డెలివరీలకూ ఈ నిషేధం వర్తిస్తుందని సెప్టెంబర్‌లో ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ టపాసుల మోత మాత్రం ఆగలేదు.

First Published:  11 Nov 2024 3:11 PM IST
Next Story