బీజేపీతో నితీశ్ కటీఫ్!
మణిపూర్ లో మద్దతు ఉపసంహరణ
ఎన్‌డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. కేంద్రం నుంచి నితీశ్ వైదొలిగగారు అనుకుంటున్నారా? కాదు.. మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించారు. ఈమేరకు మణిపూర్ జేడీయూ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. ఇకపై మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉండదని తేల్చిచెప్పారు. జేడీయూ మద్దతు ఉపసంహరణతో మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచినా ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీజేపీ శాసనసభపక్షంలో విలీనమయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీలో జేడీయూకు అబ్దుల్ నాసిర్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్నా మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీరేన్ సింగ్ ప్రభుత్వానికి సొంత పార్టీతో పాటు నాగా పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలతోనే ఆ రాష్ట్రంలో బీజేపీకి దూరం జరగాలని నితీశ్ నిర్ణయించుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నితీశ్ కుమార్ నిర్ణయం ఒక్క మణిపూర్ కే పరిమితమవుతుందా? రానున్న రోజుల్లో ఎన్‌డీఏకు ఆయన గుడ్ బై చెప్పేసి ఇండియా కూటమితో జట్టు కడతారా అన్న చర్చ మొదలైంది. బిహార్ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. మరోసారి బిహార్ సీఎం కావాలని ఆశిస్తున్న నితీశ్ కుమార్ అవసరమైతే బీజేపీకి రాం రాం చెప్పేసి ఆర్జేడీ, కాంగ్రెస్ జట్టు కట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.