Telugu Global
National

ఆరోసారి అగ్రస్థానంలో ఐఐటీ మద్రాస్‌.. దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితా–2024 విడుదల

ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఎస్‌ఐపీఈఆర్‌) రెండో స్థానంలో నిలిచింది.

ఆరోసారి అగ్రస్థానంలో ఐఐటీ మద్రాస్‌.. దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితా–2024 విడుదల
X

కేంద్రం విడుదల చేసిన దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితా–2024లో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా ఐఐటీ మద్రాస్‌ నిలిచింది. ఈ విద్యా సంస్థ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది ఆరోసారి కావడం విశేషం. ఐఐఎస్సీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌) రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ నిలిచాయి. వివిధ విభాగాల్లో దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సోమవారం విడుదల చేశారు. నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) కింద రూపొందించిన ఈ జాబితాలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, వైద్యం.. ఇలా పలు విభాగాలు ఉన్నాయి.

ఇక ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఎస్‌ఐపీఈఆర్‌) రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన స్టేట్‌ పబ్లిక్‌ యూనివర్సిటీ విభాగంలో ఉస్మానియా, ఆంధ్ర యూనివర్సిటీలకు వరుసగా ఆరు, ఏడు స్థానాలు దక్కాయి. న్యాయ విద్యలో నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా మూడో స్థానం, ఇంజినీరింగ్‌లో ఐఐటీ హైదరాబాద్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాయి.

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2024 ర్యాంకుల వివరాలిలా..

మొత్తంగా అన్ని ఉత్తమ విద్యా సంస్థల్లో టాప్‌లో ఐఐటీ మద్రాస్‌ నిలవగా, ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. టాప్‌–10లో ఏడు ఐఐటీలకు, ఐఐఎస్సీ బెంగళూరు, ఎయిమ్స్‌ ఢిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలకు చోటు దక్కాయి. యూనివర్సిటీల విభాగంలో చూస్తే.. ఐఐఎస్సీ బెంగళూరు, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. ఇక కళాశాలల విభాగంలో ఢిల్లీలోని హిందూ కాలేజీ, మిరాండా కాలేజీ, సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీ టాప్‌–3లో ఉన్నాయి.

ఇంజినీరింగ్‌ విభాగంలో చూస్తే.. ఐఐటీ మద్రాస్‌ వరుసగా తొమ్మిదో సారి మొదటి స్థానం దక్కించుకుంది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ హైదరాబాద్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్‌ తన తొలి స్థానాన్ని ఈసారీ నిలబెట్టుకుంది. రెండు, మూడు స్థానాల్లో ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్‌ నిలిచాయి. ఫార్మసీ విభాగంలో జామియా హమ్‌దర్ద్‌ (ఢిల్లీ) అగ్రస్థానం కైవసం చేసుకుంది. గతేడాది తొలి ర్యాంకులో ఉన్న హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐపీఈఆర్‌) ఈసారి రెండో స్థానానికి పడిపోయింది. బిట్స్‌ పిలానీ మూడో స్థానంలో నిలిచింది.

వైద్య విద్య విభాగంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌ టాప్‌లో నిలిచింది. చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌), వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దంత వైద్య విద్య విభాగంలో మొదటి స్థానంలో చెన్నైలోని సవీత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ టెక్నికల్‌ సైన్సెస్, రెండో స్థానంలో మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్, మూడో స్థానంలో ఢిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ నిలిచాయి. పరిశోధన సంస్థల విభాగంలో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో ఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్నాటకలోని ఐసీఏఆర్, లూథియానాలోని పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ ఉన్నాయి.

ఆవిష్కరణల విభాగంలో ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. స్టేట్‌ పబ్లిక్‌ యూనివర్సిటీల విభాగంలో చెన్నైలోని అన్నా యూనివర్సిటీ మొదటి ర్యాంక్‌ సాధించగా, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆరు, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఏడు స్థానాలు దక్కించుకున్నాయి. న్యాయవిద్య విభాగంలో బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా వర్సిటీ, ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగంలో ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఖరగ్‌పూర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలికట్‌ టాప్‌–3 ర్యాంకులు సాధించాయి. ఓపెన్‌ యూనివర్సిటీ విభాగంలో ఇగ్నోకి ప్రథమ స్థానం లభించగా, నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ కోల్‌కతా, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అహ్మదాబాద్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

First Published:  13 Aug 2024 10:55 AM IST
Next Story