Telugu Global
National

ఫాస్టాగ్‌ ఉన్నా.. ఆ వాహనాలకు రెట్టింపు టోల్‌ వసూలు

వాహనదారులు ఫాస్టాగ్‌ ఉన్నప్పటికీ దానిని వాహనం అద్దంపై అతికించకపోవడం వల్ల టోల్‌ ప్లాజాల వద్ద అనవసర జాప్యం ఏర్పడుతోంది.

ఫాస్టాగ్‌ ఉన్నా.. ఆ వాహనాలకు రెట్టింపు టోల్‌ వసూలు
X

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తాజా నిర్ణయంతో ఫాస్టాగ్‌ ఉన్నప్పటికీ పలువురు వాహనదారులు రెట్టింపు టోల్‌ చెల్లించాల్సి ఉంటుంది. అదేంటి..! ఎందుకు..? అలా చెల్లించాల్సింది ఎవరు.. అంటారా? అయితే.. ఇది మీ కోసమే. టోల్‌ గేట్ల వద్ద రద్దీ నియంత్రణ కోసం పలు చర్యలు చేపట్టిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.

ఫాస్టాగ్‌ ఉన్నప్పటికీ రెట్టింపు టోల్‌ భారం పడేది ఎవరిపైనంటే.. ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ను అద్దం ముందు అమర్చని వాహనదారులకు. అవును.. పలువురు వాహనదారులు ఫాస్టాగ్‌ ఉన్నప్పటికీ దానిని వాహనం అద్దంపై అతికించకపోవడం వల్ల టోల్‌ ప్లాజాల వద్ద అనవసర జాప్యం ఏర్పడుతోంది. దీనివల్ల తోటి వాహనదారులకు అసౌకర్యం కలుగుతోంది. దీనిని గుర్తించిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తాజా మార్గదర్శకాలను రూపొందించారు.

ఆ మార్గదర్శకాలివే..

– వాహనానికి ముందు ఉండే అద్దంపై ఫాస్టాగ్‌ అతికించకుండా టోల్‌ దాటే వాహనాలకు విధించే జరిమానాకు సంబంధించిన సమాచారాన్ని టోల్‌ ప్లాజాల ప్రవేశమార్గాల్లో ప్రదర్శించాలి.

– ఫాస్టాగ్‌ లేని కేసుల్లో సదరు వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో కూడిన సీసీటీవీ ఫుటేజీలను భద్రపరచాలి. తద్వారా టోల్‌ లైనులో వాహనం వెళ్లినట్టు నిర్ధారించుకునేందుకు ఈ వీడియో దోహదపడుతుంది.

– వాహనం లోపలి నుంచి ఫాస్టాగ్‌ను అతికించడంపై గతంలో జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయడమే లక్ష్యంగా ఎన్‌హెచ్‌ఏఐ ఈ చర్యలు చేపడుతోంది.

– ఫాస్టాగ్‌లను జారీ చేసే బ్యాంకులు కూడా వాహనంపై నిర్దేశించిన చోట వాటిని అతికించేలా చర్యలు తీసుకోవాలి.

First Published:  19 July 2024 12:03 PM IST
Next Story