Telugu Global
National

ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలివే

రేపు కేంద్ర పద్దును సభకు సమర్పించనున్న నిర్మలా సీతారామన్‌

ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలివే
X

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2024-2025 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచారు. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా సభను శనివారానికి వాయిదా వేశారు. రేపు (ఫిబ్రవరి 1న) కేంద్ర పద్దును నిర్మలమ్మ సభకు సమర్పించనున్నారు.

కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనామిక్‌ సర్వే. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనామిక్‌ డివిజన్‌ ఈ సర్వేను రూపొందిస్తుంది. మొదట 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్‌కు ఒకరోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది.

ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలివే..

  1. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ.. దేశ జీడీపీ 6.3-6.8 శాతంగా ఉండొచ్చు.
  2. వచ్చే ఏడాది ఆర్థిక పరిస్థితులు మందకొడిగా ఉంటాయని అంచనా వేశారు.
  3. తయారీ రంగం నెమ్మదించడం, కార్పొరేట్‌ పెట్టుబడులు తగ్గడంతో 2024-25లో భారత వృద్ధి రేటు 6.4 శాతంగా ఉన్నది. గత నాలుగేళ్లలో ఇదే అత్యల్పం. 2023-24లో వృద్ధి రేటు 8.2 శాతంగా ఉండగా.. 2022-23 లో 7.2 శాతం, 2021-22లో 8.7 శాతంగా ఉన్నది.
  4. ఖరీఫ్‌ పంట రావడంతో ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. దీంతో 2024-25 నాలుగో త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చు.
  5. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భయాలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చు. అయితే, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల రూపంలో ఇంకా ముప్పు పొంచే ఉన్నది.
  6. ప్రభుత్వ మూలధనం పెరగడం, వ్యాపార అంచనాలు మెరుగుపడటంతో పెట్టుబడులు పుంజుకుంటాయని అంచనా
  7. దేశీయంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా బలహీన డిమాండ్‌ నేపథ్యంలో గత ఏడాది తయారీ రంగం ఒత్తిడికి గురైంది.
  8. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఐపీఓ లిస్టింగ్‌లు గణనీయంగా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఐపీవో లిస్టింగ్‌ల్లో మన వాటా 30 శాతంగా ఉన్నది. 2023 తో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ.
  9. గత ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనివల్ల భారీ మౌలిక వసతుల రంగాల్లో కేంద్ర మూలధన వ్యయం 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 38.8 శాతం పెరిగింది.
  10. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5853 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మాణం పూర్తి,
  11. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ఇప్పటివరకు 12 కోట్ల కు పైగా కుటుంబాలకు కొళాయిల ద్వారా తాగు నీటి సదుపాయం
First Published:  31 Jan 2025 2:45 PM IST
Next Story