Telugu Global
National

మేధావులు..మా పాలనను ఇతర పార్టీల పాలనతో పోల్చి చూడండి

కెన్‌-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ వ్యాఖ్యలు

మేధావులు..మా పాలనను ఇతర పార్టీల పాలనతో పోల్చి చూడండి
X

స్వాతంత్య్రం వచ్చాక బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ఇతర పార్టీల పాలనతో పోల్చి చూడాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కెన్‌-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ఆయన నేడు ఖజురహోలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రెండు నదుల నీళ్లను ఆయన ప్రాజెక్టు నమూనాలో పోశారు. అనంతరం రిమోట్‌ బటన్‌ సాయంతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏడాది పూర్తయింది. ఈ కాలంలో ఇక్కడి అభివృద్ధికి కొత్త దిశ లభించింది. ఇక్కడ రూ. వేల కోట్ల విలువైన కార్యక్రమాలు మొదలయ్యాయి. నేడు కెన్‌-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. దేశాభివృద్ధిలో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కీలక పాత్ర పోషించారు. సుశాన్‌ దినోత్సవం మా ప్రభుత్వానికి ఒక్క రోజు కార్యక్రమం కాదు.. మా గుర్తింపు అది.

దేశ ప్రజలు మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో వరుసగా మా పార్టీని ఎన్నుకోవడంలో సుపరిపాలన పాత్ర చాలా కీలకం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని మేధావులు కొన్ని ప్రమాణాలను తీసుకొని.. కాంగ్రెస్‌, లెఫ్ట్‌, కుటుంబ, సంకీర్ణ పార్టీల పాలనలో ఏం పనులు జరిగాయి? బీజేపీ ఉన్న చోట్ల అభివృద్ధి ఎలా జరిగిందో విశ్లేషించాలి. మా పార్టీ ప్రజల కోసం కట్టుబడి ఉంది. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఎంతవరకు చేరాయి అన్నదే ప్రమాణికం. కాంగ్రెస్‌ సర్కార్‌ కేవలం అభివృద్ధి ప్రకటనల హడావుడికే పరిమితమౌతుంది. ఆ పథకాల ఫలాలు ప్రజలకు చేరేవి కావు. ఏళ్ల కిందట శంకుస్థాపనలు అయిన వాటి పని కూడా ఒక్క అంగుళం ముందుకు జరగకపోవడాన్ని మేము గమనించాం. మా ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తప్పించామన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జల్‌శక్తిపై ఎవరు పనిచేశారో తెలుసా.. వాస్తవాలను ఇన్నాళ్లూ దాచిపెట్టారు. భారత జల్‌శక్తి, డ్యామ్‌ల వెనుక ఘనత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు చెందుతుంది అన్నారు. అంతకుముందు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పేరిట పోస్టల్‌ స్టాంప్‌, రూ. 100 నాణెంను ప్రధాని మోడీ విడుదల చేశారు.

నదుల అనుసంధానంలో మొదటిదైన కెన్‌-బెత్వా పథకం వల్ల ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు, ప్రత్యేకించి వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. 2009లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. మొత్తం ఒకేసారి కాకుండా దశలుగా విభజించి పనులు చేపట్టాలని నిర్ణయించింది. మొదటి దశకు 2017 జూన్‌లో పెట్టబడి అనుమతి లభించింది.

First Published:  25 Dec 2024 3:30 PM IST
Next Story