రాహుల్ నెట్టేశారు.. బీజేపీ ఎంపీలు నన్ను బెదిరించారు
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటులో ఇండియా కూటమి, ఎన్డీఏ ఎంపీల పోటాపోటీ నిరసనలు
పార్లమెంటు ప్రాంగణంలో గురువారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార ఎన్డీఏ పక్షం ఎంపీలు కూడా నిరసన చేపట్టారు. ఇందులోభాగంగా పార్లమెంటులోని వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఒడిషాకు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు.
అధికారపక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో ఈ ఘటన జరిగిందని ఎన్డీఏ పక్ష ఎంపీలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ.. నేను మెట్ట వద్ద నిల్చొని ఉండగా.. రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారు. ఆయన వచ్చి నాపై పడటంతోనేను కిందపడ్డానని ఆరోపించారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. జరిగిందంతా మీ కెమెరాల్లో కనబడి ఉండొచ్చు. నేను పార్లమెంటు లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తోసేశారు. బెదిరించారు. మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉన్నది. కానీ వారు అడ్డుకుంటున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే రాజ్యాంగంపై వారు (బీజేపీని ఉద్దేశించి) దాడి చేస్తున్నారు. అంబేద్కర్‌ను అవమానించారని రాహుల్ ధ్వజమెత్తారు.
పార్లమెంటు వద్ద పోటాపోటీ నిరసనల్లో ఇద్దరు ఎంపీలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు ఎంపీలకు రామ్‌మనోహర్ లోహియా 'ఆర్‌ఎంఎల్ ) హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు ఎంపీలకు తలకు దెబ్బలు తగిలాయని ఆర్‌ఎంఎల్ డాక్టర్లు తెలిపారు. ప్రతాప్ సారంగికి తీవ్ర రక్తస్రావం జరిగిందని, ఆయనకు తలకు లోతైన గాయయైనట్టు డాకర్లు చెప్పారు.సారంగి తలకు కుట్లు వేశామన్నారు. ముకేశ్ రాజ్‌పుత్ స్పృహ కోల్పోయిన స్థితిలో వచ్చారని, వైద్యం అందించాక ఆయన స్పృహలోకి వచ్చారని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. గందరగోళ పరిస్థితుల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.