ఉద్యోగాలు ఇచ్చేవారిపై రాజకీయ విమర్శలు తగవు
అదానీపై వచ్చిన ఆరోపణలపై విపక్షాలు జేపీసీకి పట్టుబడుతున్న వేళ సద్గురు జగ్గీ వాసుదేవ్ పోస్ట్
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలపై జేపీసీ విచారణ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో విపక్షాల నిరసనలతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఈ అంశంపై చర్చ జరగాలని విపక్ష ఎంపీలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.
భారత్ ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ఒక దీపస్తంభంగా ఉండాలని ఆకాంక్షిస్తున్న తరుణంలో పార్లమెంటులో సమావేశాలకు పదే పదే అంతరాయం కలగడం నిరుత్సాహ పరుస్తున్నది. భారత్‌లో సంపద సృష్టించేవారు, ఉద్యోగాలు ఇచ్చేవారిపై రాజకీయ విమర్శలు తగవన్నారు. ఏవైనా అవకతవకలు చోటు చేసుకుంటే.. చట్ట ప్రకారం చర్యలు ఉండాలి. అంతేగానీ.. రాజకీయంగా ఫుట్‌బాల్ ఆడటం తగదన్నారు. భారతదేశం భవ్య భారత్‌గా మారాలంటే.. వ్యాపారాలు వృద్ధి చెందడం ఒక్కటే మార్గమని తన పోస్టులో రాసుకొచ్చారు