Telugu Global
National

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

398 పాయింట్లకు చేరుకున్న గాలి నాణ్యత సూచీ.. పరిస్థితిని 'తీవ్రంగా' పరిగణన

ఢిల్లీని  కమ్మేసిన కాలుష్యం
X

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. బాణసంచాపై నిషేధం ఉన్నప్పటికీ దానిని కొంతమంది పట్టించుకోలేదు. దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం రాత్రి పలుచోట్ల ప్రజలు టపాసులు కాల్చారు. దీంతో తీవ్రమైన శబ్ద కాలుష్యంతో పాటు గాలి నాణ్యత విపరీతంగా పడిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగ అలుముకున్నది. ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించలేనంత పరిస్థితి నెలకొన్నదంటే పరిస్థితి ఏవిధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

ఢిల్లీలోని ఆనంద్‌ విహార్లో ఉదయం 6 గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (AQI) 398 పాయింట్లకు చేరుకున్నది. దీంతో పరిస్థితిని 'తీవ్రంగా' పేర్కొన్నారు. బురారీ, ఆర్కేపురం, అశోక్‌ విహార్‌, మందిర్‌ మార్గ్‌, ఎయిర్‌పోర్ట్‌, జహంగీర్‌పుర్‌లోనూ సూచీ 350 పైనే ఉండటం విశేషం. అటు నోయిడా, గాజియాబాద్‌, గురుగ్రామ్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొన్నది. అర్ధరాత్రి తర్వాత నుంచి గాలి నాణ్యత సూచీ పడిపోతూ వచ్చింది.

ప్రతి ఏడాదిలాగే ఈసారీ ఢిల్లీలో బాణ సంచా తయారీ, విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో విక్రయాలు, డెలివరీలకు ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొన్నది. అయినప్పటికీ.. కొందరు ఈ ఆంక్షలు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే కొన్నిరోజులుగా ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోగా.. తాజాగా దీపావళి బాణసంచాతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

First Published:  1 Nov 2024 10:04 AM IST
Next Story