ఈ దీపావళి ప్రత్యేకమైనది
500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలోకి శ్రీరాముడు కొలువైన వేళ వచ్చిన తొలి దీపావళి అన్న మోడీ
ఈసారి ప్రత్యేకమైన దీపావళిని మనం చూస్తున్నామని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 'ధన త్రయోదశి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. మరో రెండురోజుల్లో ప్రత్యేకమైన దీపావళి జరుపుకోబోతున్నాం. సుమారు 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలోకి శ్రీరాముడు కొలువైన వేళ వచ్చిన తొలి దీపావళి ఇది. ఈ ప్రత్యేక వేళకు మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉంటున్నాం. నేడు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో రోజ్‌గార్ మేళాలను నిర్వహించారు. వీటిల్లో వివిధ మంత్రిత్వ శాఖల్లో నియామకాలు చేపట్టారు. ఈ ఉద్యోగాల్లో కొత్తగా చేరిన వారందరికీ 'కర్మయోగి ప్రారంభ్' విధానం కింద శిక్షణ ఇస్తున్నారు. ఐటీవోటీ కర్మయోగి పోర్టల్ సుమారు 1,400 కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. దీని నుంచి వారికి వివిధ రంగాల్లో నైపుణ్యాలను నేర్పుతారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలను ప్రారంభించిన ప్రధాని
మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఏఐఐఏ నుంచి వర్చువల్‌గా ఆయన ఈ సేవలను ఆవిష్క రించారు. అనంతరం ఎయిమ్స్‌లో అధికారులు ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్షలు చేపట్టారు. ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్‌సీ వరకూ డ్రోన్‌ను పంపించారు. ఓ మహిళా రోగి నుంచి రక్త నమూనా సేకరించి ఎయిమ్స్‌కు అది తిరిగి వచ్చింది. ఎయిమ్స్ నుంచి ఈ పీహెచ్‌పీ సుమారు 12 కి.మీ దూరంలో ఉన్నది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి డ్రోన్ల వినియోగంపై ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.