Telugu Global
National

నియంత పాలన సాగిస్తున్నఎన్డీఏ

ప్రధాని మోడీ సభలో లేకుండా రాజ్యాంగంపై చర్చలా? అని ప్రశ్నించిన అఖిలేశ్

నియంత పాలన సాగిస్తున్నఎన్డీఏ
X

సభలో ప్రధాని మోడీ లేకుండా రాజ్యాంగంపై చర్చలా? అని సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్ సభలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ హయాంలో వేలాదిమంది సామాన్యులు దేశం విడిచి వెళ్లిపోయారని అన్నారు. చాలామంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం నియంత పాలన సాగిస్తున్నదని, యూపీ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయకుండా అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. మహిళలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పోలీసులు గన్ లతో బెదిరించి అడ్డుకున్నారు. అయినప్పటికీ ప్రాణాలకు తెగించి వారంతా పోలింగ్ లో పాల్గొన్నారని సభకు వివరించారు.

దేశ సరిహద్దుల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, పొరుగున ఉన్న చైనా సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడుతున్నా తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. మరోవైపు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి తలసరి ఆదాయంపై ప్రభుత్వం కచ్చితమైన గణాంకాలతో ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో పౌరులంతా సమానమేనని, కానీ ఇప్పుడు మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడుతామన్నారు. దీనివల్ల కులాల మధ్య వ్యత్యాసం తగ్గుతుందని వివరించారు.

First Published:  13 Dec 2024 4:33 PM IST
Next Story