నేషనల్ ఓటర్స్ డే: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఎన్నికల సంఘం పనితీరుపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోస్ట్‌ల వార్
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం పనితీరుపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోస్ట్‌ల వార్ నడిచింది. ఈసీపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించగా.. కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది శక్తిమంతమైన మన ప్రజాస్వామ్యానికి గుర్తు. ఇది ప్రతి పౌరుడికి తన ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది. మన భవిష్యత్తుకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ విషయంలో ఎన్నికల సంఘం పనితీరును అభినందిస్తున్నా అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఈ పోస్టుకు ఇటీవల మన్ కీ బాత్‌లో చేసిన ప్రసంగాన్ని జోడించారు. అందులో పోలింగ్ ప్రకియను ఆధునికీకరించడంతో పాటు ప్రజల శక్తిని బలోపేతం చేయడానికి ఈసీ కృషి చేస్తున్నదని ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉండగా.. ఈసీ పనితీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా భారత ఎన్నికల సంఘం పనితీరు క్షీణించిందని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అయినప్పటికీ.. మన ఎన్నికల ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకొని, ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు అనేది పట్టణస్థాయి నుంచి అట్టడుగుస్థాయి వరకు విస్తరించిందని కొనియాడారు. అయితే మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మన సంస్థల స్వతంత్రతను కాపాడుకోవడం ముఖ్యమని హెచ్చరించింది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తూ పోస్టు పెట్టారు.