Telugu Global
National

జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌, పాల్గొన్న ఎంపీ అర్వింద్‌

జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
X

నిజామాబాద్‌ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు. పీయూష్‌ గోయెల్‌ను ఆయన పసుపు కొమ్మల దండతో సత్కరించారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్‌ 1న మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్‌ 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దానికి ఛైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. నేటి నుంచి నిజామాబాద్‌ కేంద్రం పసుపు బోర్డు కార్యకలాపాలు మొదలవుతాయి. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. పీయూష్‌ గోయెల్‌ దీన్నిప్రారంభిస్తారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ మాట్లాడుతూ.. సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మోడీ ఆశ్వీర్వాదంతో పసుపు బోర్డు మంజూరు చేశామన్నారు. తొలి ఛైర్మన్‌గా నియమితులైన గంగారెడ్డి శుభాకాంక్షలు.

పసుపు బోర్డు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో చాలామంది పసుపు బోర్డు గురించి మాట్లాడి సాధించలేదు. తెలంగాణ ప్రజల తరఫున పీయూష్‌ గోయెల్‌కు ధన్యవాదాలు తెలిపారు.

First Published:  14 Jan 2025 12:31 PM IST
Next Story