Telugu Global
National

హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్‌ సైనీ ఎన్నిక

రేపు ప్రమాణ స్వీకారం.. హాజరు కానున్న ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలు

హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్‌ సైనీ ఎన్నిక
X

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సీఎం ఎంపికపై ఆపార్టీ అధిష్ఠానం చర్చించింది. పార్టీని మరోసారి విజయపథంలో నడిపిన నాయబ్‌సింగ్‌ సైనీవైపే మొగ్గుచూపెట్టింది. ఆయననే రెండోసారి సీఎంగా కొనసాగించడానికి హైకమాండ్‌ సుముఖత వ్యక్తం చేసింది. నేడు జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఈ మేరకు సైనిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం, కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, సీనియర్‌నేత అనిల్‌విజ్‌ ఆయన పేరు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. హర్యానా సీఎంగా ఆయన గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ హాజరయ్యారు. నూతన సీఎంగా ఎన్నికైన నాయబ్‌ సింగ్‌ సైనీకి నేతలు విషెస్‌ చెప్పారు. రేపు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు పలువురు బీజేపీ పాలిత సీఎంలు, భాగస్వామ్యపక్షాల నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్థానంలో ఎన్నికలకు 200 రోజుల ముందు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సైనీ పార్టీని మరోసారి అధికారంలోకి తేవడానికి శ్రమించారు. గెలుపు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానై ప్రచారం చేసిన ప్రధాని మోడీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రికే ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారు. అందుకే గెలిచినా ఓడినా తనదే బాధ్యత అని నాయబ్‌సింగ్‌ సైనీ ప్రకటించారు. ఈ నెల 8న వెల్లడైన హర్యానా అసెంబ్లీ ఫలితాల్లో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ 48 సీట్లు గెలుచుకుని మూడోసారి అధికారంలోకి వచ్చి అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. హర్యానాలో అధికారం మాదేనని ధీమా వ్యక్తం చేసిన హస్తం పార్టీ 37 సీట్లకే పరిమితమైంది.

First Published:  16 Oct 2024 2:07 PM IST
Next Story