వారానికి 40 గంటల పని ఉండాలి: శశిథరూర్
యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగిని అన్నా సెబాస్టియన్ పెరయిల్ మరణం బాధాకరమన్న కాంగ్రెస్ ఎంపీ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు
వారానికి 40 గంటలకు మించి పని ఉండకూడదని, దీనికోసం పార్లమెంటులో చట్టం తేవడానికి కృషి చేస్తామని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు. ఇటీవల పని ఒత్తిడితో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగిని అన్నా సెబాస్టియన్ పెరయిల్ మరణం బాధాకరం అన్నారు. ఆమె తండ్రిని శశిథరూర్ పరామర్శించారు. యర్నెస్ట్ అండ్ యంగ్‌ఇండియాలో రోజుకు 14 గంటల పాటు నాలుగు నెలలు పనిచేసి తీవ్ర ఒత్తిడితో అన్నా స్టెబాస్టిన్ ప్రాణాలు కోల్పోయిందని కాంగ్రెస్ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రోజుకు 8 గంటలు, వారానికి ఐదు రోజులకు మించి ఉద్యోగులతో పనిచేయించకూడదు. అన్ని పని ప్రదేశాల్లో ఫిక్స్‌డ్ క్యాలెండర్ ఉండాలి. పని ప్రదేశాల్లో మానవ హక్కులను అడ్డుకోకూడదని శశిథరూర్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అమానవీయ చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు, జరిమానాలు విధించేలా చట్టం తీసుకురావాలన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వారానికి 40 గంటల పని అంశాన్ని లేవనెత్తుతామని శిశిథరూర్ రాసుకొచ్చారు.