మూసీకి ముఖ్యమంత్రే మరణశాసనం రాస్తున్నడు
రాడార్ స్టేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం : కేటీఆర్
మూసీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరణశాసనం రాస్తూనే ఇంకోవైపు సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేవీకి సంబంధించిన వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పర్యావరణవేత్తలతో కలిసి దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ఈ రాడార్ స్టేషన్ కు మంగళవారం శంకుస్థాపన చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఏం ఆశించి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2,900 ఎకరాల అడవిలో 12 లక్షల చెట్లు నరికేసి ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని తెలిపారు. జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ స్టేషన్ ను తెలంగాణలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. మాటకు ముందు మూసీ పరిరక్షణ అని చెప్తోన్నరేవంత్ రెడ్డి.. ఈ రాడార్ స్టేషన్ తో మూసీనే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై గడిచిన పదేళ్లలో ఎంతగా ఒత్తిడి తెచ్చినా రాడార్ స్టేషన్ ఏర్పాటుకు అంగీకారం తెలుపలేదన్నారు. పచ్చదనం, అడవుల విస్తీర్ణం పెంచడానికి తాము హరితహారం చేపడితే.. రేవంత్ రెడ్డి 2,900 ఎకరాల అడవిని నాశనం చేసేందుకు ఉపక్రమించారని అన్నారు. గంగానది జన్మస్థలం గంగోత్రి సమీపంలోని 150 కి.మీ.ల పరిధిని కేంద్ర ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించిందని గుర్తు చేశారు. వికారాబాద్ అడువుల్లోనే మూసీ నది పుట్టిందని, ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించడం లేదో చెప్పాలన్నారు. గంగానదికి ఒక న్యాయం మూసీకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. రాడార్ స్టేషన్ ఏర్పాటుతో మూసీ నది అంతర్థానం అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే రాడార్ స్టేషన్ ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణ విషయంలో తెలంగాణ ముందుంటుందని, జనావాసాలు లేని ప్రాంతంలో రాడార్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.