Telugu Global
National

మన్మోహన్‌ పార్థివదేహానికి మోడీ, సోనియా, రాహుల్‌ నివాళులు

అతని కుటుంబసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు

మన్మోహన్‌ పార్థివదేహానికి మోడీ, సోనియా, రాహుల్‌ నివాళులు
X

భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలు నివాళు అర్పించారు. అతని కుటుంబసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, ఇతరులు కూడా మన్మోహన్‌ నివాసానికి చేరుకుని ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.

92 ఏళ్ల మన్మోహన్‌ వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో నిన్న రాత్రి ఇంటివద్ద అకస్మాత్తుగా స్పహ కోల్పోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మన్మోహన్‌ పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలు అందించారు. అంతకుముందు ఆర్‌బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. ప్రధానిగా పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. శనివారం (డిసెంబర్‌ 28) ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మన్మోహన్‌ పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు. ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. రాజ్‌ఘాట్‌ సమీపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. మన్మోహన్‌ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతకాన్ని సగానికి అవనతం చేశారు. అటు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంపైనా జాతీయ జెండాను సగానికి దించారు.

First Published:  27 Dec 2024 11:25 AM IST
Next Story