రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం
కరెన్సీ నోట్ల ఆరోపణలపై విచారణ జరుగుతున్నదన్న రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్
రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలంపై ఆందోళన జరుగుతున్నది. గురువారం కాంగ్రెస్ సభ్యులు అభిషేక్ మను సింఘ్వీ కుర్చీ వద్ద నోట్ల కట్టను గుర్తించారు. కరెన్సీ నోట్ల ఆరోపణలపై విచారణ జరుగుతున్నదని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తెలిపారు. విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. కరెన్సీ నోట్ల అంశంపై విచారణ జరపాలని బీజేపీ పట్టుబడుతున్నది. దేశం మొత్తాన్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తున్నదని పీయూష్ గోయెల్ మండిపడ్డారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. గురువారం సభను వాయిదా వేసిన తర్వాత భద్రతా అధికారులు ఛాంబర్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే 22వ నంబర్ సీటు వద్ద ఓ నోట్ల కట్టను గుర్తించారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకునిరాగానే దర్యాప్తునకు ఆదేశించానని వెల్లడించారు.
దీనిపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. రూ.500, రూ. 100 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్‌ఖడ్ తెలిపారు. ఆ నోట్లు అసలైనవో.. నకిలీవో స్పష్టత లేదన్నారు. ఈ విషయాన్ని సభకు చెప్పడం తన బాధ్యత అన్నారు. దీంతో ఇది కాస్తా వివాదానికి దారితీసింది. ఛైర్మన్ ప్రకటనను సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఘటనపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన ఆయన దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ఖర్గే వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. పేరు చెబితే తప్పేంటిఆ? ఏ సీటు వద్ద నగదు దొరికిందో.. అక్కడ ఎవరు కూర్చుంటారో ఛైర్మన్ చెప్పారు. అందులో సమస్య ఏముంది? ఇలా నోట్ల కట్టలను సభకు తీసుకురావడం సరికాదన్నారు. దీనిపై సీరియస్‌గా దర్యాప్తు జరగాలన్నారు.
మరోవైపు ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను కేవలం ఒకే ఒక్క రూ. 500 నోటు తీసుకొచ్చానని తెలిపారు. ఇలాంటి పరిస్థితిని నేనెన్నడూ చూడలేదు. నిన్న రాజ్యసభకు వచ్చేటప్పుడు నా జేబులో కేవలం ఒక రూ. 500 నోటు మాత్రమే ఉన్నది. నిన్న మధ్యాహ్నం 12.57 గంటలకు సభలోపలికి వచ్చాను. ఒంటి గంటకు సభ వాయిదా పడటంతో క్యాంటీన్‌కు వెళ్లాను. మధ్యాహ్నం 1.30 గంటలకు పార్లమెంట్ నుంచి వెళ్లాయనని సింఘ్వీ రాసుకొచ్చారు.