Telugu Global
National

కేరళలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృత్యువాత

మెప్పాడిలోని ముండకై ప్రాంతంలో ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. తొండర్‌నాడ్‌ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఒక బాలిక ఈ ఘటనలో మృతిచెందింది.

కేరళలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృత్యువాత
X

కేరళలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో జనం చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. అధికారులు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 16 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున జ‌రిగిన‌ ఈ ఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కేరళ రాష్ట్రం వయనాడ్‌ జిల్లాలో గల మెప్పాడి సమీపంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలోను, ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలోను ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం వల్ల వందలాది వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయని అధికారులు వెల్లడించారు. ఇళ్లు కూడా అనేకం ధ్వంసమైనట్టు తెలుస్తోంది. దాదాపు 400 కుటుంబాలు ఈ ప్రమాదం ప్రభావానికి గురైనట్టు చెబుతున్నారు.

మెప్పాడిలోని ముండకై ప్రాంతంలో ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. తొండర్‌నాడ్‌ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఒక బాలిక ఈ ఘటనలో మృతిచెందింది. మొత్తంగా ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై కేరళ రెవెన్యూ మంత్రి కె.రాజన్‌ స్పందిస్తూ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని, హెలికాప్టర్‌ను కూడా సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. సీఎం పినరయి విజయన్‌ స్పందిస్తూ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు తక్షణ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. చులర్మల, వెల్లర్మల తదితర ప్రాంతాలు ఈ ఘటన ప్రభావానికి గురైనట్టు తెలుస్తోంది. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును ఎన్నడూ చూడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  30 July 2024 4:00 AM GMT
Next Story