Telugu Global
National

ఒలింపిక్స్ లో భారత్ బోణీ.. మను బాకర్ రికార్డ్

22 ఏళ్ల వయసులో ఆమె తొలి ఒలింపిక్ మెడల్ సాధించింది. భారత ప్రభుత్వంతోపాటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆమె గెలుపుపై సంతోషం వ్యక్తం చేశాయి.

ఒలింపిక్స్ లో భారత్ బోణీ.. మను బాకర్ రికార్డ్
X

ఒలింపిక్ పతకాల పట్టికలో ఈ ఏడాది భారత్ పేరుని చేర్చిన మొదటి క్రీడాకారిణిగా నిలిచింది యువ షూటర్ మను బాకర్. భారత్ తరపున 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించింది. షూటింగ్ లో తొలి ఒలింపిక్ పతకం సాధించిన భారత మహిళగా ఆమె రికార్డ్ సృష్టించింది. ఫైనల్‌లో మను బాకర్‌ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి మెడల్ గెలుచుకుంది. 10మీటర్ల షూటింగ్ పురుషుల విభాగంలోనూ భారత్ కి పతకం వచ్చే అవకాశముంది. అర్జున్ బబుతా 630.1 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. పురుషుల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌ సోమవారం మధ్యాహ్నం జరుగుతుంది.


హర్యానా క్రీడా రత్నం మను..

మను బాకర్ హర్యానాకు చెందిన క్రీడాకారిణి. చిన్నప్పటినుంచే ఆమెకు క్రీడలంటే ఇష్టం. షూటింగ్ తో పాటు బాక్సింగ్, స్కేటింగ్, జూడోలో కూడా ఆమె తన సత్తా చాటింది. 2017 కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో మను ఏకంగా 9 బంగారు పతకాలు సాధించి జాతీయ రికార్డును బద్దలుకొట్టింది. 2017లో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్‌ షిప్‌లో ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. 2018 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో భారతదేశానికి రెండు బంగారు పతకాలు సాధించింది మను. 2018 కామన్వెల్త్ గేమ్స్ లోనూ మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించింది. 2020లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు పురస్కారం ఆమెను వరించింది.

22 ఏళ్ల వయసులో ఆమె తొలి ఒలింపిక్ మెడల్ సాధించింది. భారత ప్రభుత్వంతోపాటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆమె గెలుపుపై సంతోషం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

First Published:  28 July 2024 11:23 AM GMT
Next Story