SUV CARS | ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటాపోటీ.. ఆగస్టులో ఆవిష్కరించే బెస్ట్ కార్లివే..!
ఆగస్టులో సరికొత్త ఎస్‌యూవీ కార్లు మార్కెట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. టాటా మోటార్స్ (Tata Motors) నుంచి టాటా కర్వ్ (Tata Curvv) కూపే ఎస్‌యూవీ, మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) వారి 5-డోర్ థార్ రాక్స్ (Thar Roxx), సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) వచ్చేనెలలో భారత్ రోడ్లెక్కనున్నాయి.
SUV CARS | దేశీయ కార్ల మార్కెట్‌లో రోజురోజుకు ఎస్‌యూవీ కార్లకు గిరాకీ పెరుగుతోంది. కుటుంబ సభ్యులంతా స్పేసియస్‌గా ఉండటంతోపాటు ధృడమైన సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఎస్‌యూవీ కార్లపై ప్రతి ఒక్కరూ మోజు పెంచుకుంటున్నారు. దీంతో కార్ల తయారీ సంస్థల్లోనూ చౌక ధరకు ఎస్‌యూవీ కార్ల తయారీలో పోటీ పెరిగింది. ఆగస్టులో మరో మూడు చౌక ఎస్‌యూవీ మోడల్ కార్లు మార్కెట్లోకి రానున్నాయి. దేశీయ ఆటోమొబైల్ సంస్థటు టాటా మోటార్స్, మహీంద్రాతోపాటు ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్.. ఆగస్టులో సరికొత్త ఎస్‌యూవీ కార్లు మార్కెట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. టాటా మోటార్స్ (Tata Motors) నుంచి టాటా కర్వ్ (Tata Curvv) కూపే ఎస్‌యూవీ, మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) వారి 5-డోర్ థార్ రాక్స్ (Thar Roxx), సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) వచ్చేనెలలో భారత్ రోడ్లెక్కనున్నాయి.
ఆగస్టు 14న మహీంద్రా థార్ ఆవిష్కరణ
మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra &Mahindra) తయారు చేసిన 5-డోర్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx) కారును ఆగస్టు 14న ఆవిష్కరించనున్నది. న్యూ గ్రిల్లె, సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫాగ్ లాంప్స్, టెయిల్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ యూనిట్స్, రీ డిజైన్డ్ అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వ్యూ తదితర ఫీచర్లు జత కలిశాయి. మహీంద్రా థార్ రాక్స్ ఇంటీరియర్ ఫీచర్లు వెల్లడించలేదు కానీ, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25- అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయని తెలుస్తోంది.
మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx) కారు 1.5- లీటర్ల డీ117 సీఆర్‌డీఈ డీజిల్, 2.2- లీటర్ల ఎంహవాక్ 130 సీఆర్డీఈ డీజిల్, 2.0- లీటర్ల ఎం స్టాలియన్ 150 టీజీడీఐ పెట్రోల్ ఆప్షన్లలో వస్తోంది. ఈ కార్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తాయి. 4డబ్ల్యూడీ సెటప్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గుర్ఖా మోడల్ కార్లకు గట్టి పోటీ ఇస్తుంది మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx). ఈ కారు ధర రూ.12.50 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
టాటా మోటార్స్ కూపే ఎస్‌యూవీ టాటా కర్వ్
దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కూపే ఎస్‌యూవీ టాటా కర్వ్ కారును ఆగస్టు ఏడో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ)తోపాటు తొలిసారి టాటా మోటార్స్ ఆవిష్కరిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ టాటా కర్వ్.ఈవీ కూడా ఉంది. టాటా కర్వ్ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ ఫ్రంట్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. టాటా నెక్సాన్.ఈవీ కారు స్ఫూర్తితో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ వీల్ తదితర ఫీచర్లు ఉంటాయి.
ఇక టాటా కర్వ్.ఈవీ కారు ఎంజీ జడ్ఎస్ ఈవీ, బీవైడీ అట్టో3 తోపాటు త్వరలో మార్కెట్లోకి రానున్న హ్యుండాయ్ క్రెటా ఈవీ కార్లతో పోటీ పడనున్నది. టాటా కర్వ్ (ఐసీఈ) కారు హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.
టాటా కర్వ్.ఈవీ కారు సింగిల్ ఫుల్ చార్జింగ్‌తో 500 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. దీని ధర రూ.18 -24 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఇక టాటాకర్వ్ (ఐసీఈ) కారు 1.2 లీటర్ల టర్బో పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్లతో వస్తోందని భావిస్తున్నారు. మల్టీపుల్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ధర రూ.11-19 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుందని తెలుస్తోంది.
సిట్రోన్ నుంచి ఐదో మోడల్ కారు బసాల్ట్
ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ తయారు చేసిన సిట్రోన్ బసాల్ట్ కారు ఆగస్టు రెండో తేదీన భారత్ మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. సిట్రోన్ భారత్‌లో ఆవిష్కరిస్తున్న ఐదో కారు ఇది. ఇంతకుముందు సీ3 ఎయిర్ క్రాస్, సీ5 ఎయిర్ క్రాస్, సీ3, ఈ-సీ3 కార్లను భారత్ మార్కెట్లోకి తెచ్చారు. తాజాగా ఆవిష్కరించనున్న సిట్రోన్ బసాల్ట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు ఉంటాయి. సిట్రోన్ బసాల్ట్ కారు 1.2 లీటర్ల జెన్-3 టర్బో ప్యూర్ టెక్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. సీ3 ఎయిర్ క్రాస్ కారులో కూడా ఇదే ఇంజిన్ వినియోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 110 పీఎస్ విద్యుత్, 190 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తోంది. త్వరలో మార్కెట్లోకి రానున్న టాటా కర్వ్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్ వంటి కార్లతో పోటీ పడుతుంది.