మహారాష్ట్రను స్వీప్ చేసిన మహాయుతి
లోక్‌సభ ఎన్నికల్లో డీలా.. ఐదు నెలల్లోనే అన్ని ప్రాంతాల్లో తిరుగులేని ఆదిపత్యం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి స్వీప్ చేసింది. అన్ని ప్రాంతాల్లోనూ తిరుగులేని ఆదిపత్యం కనబరిచింది. కేవలం ఐదు నెలల స్వల్ప వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలను అధిగమించి అద్భుత విజయం సొంతం చేసుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ఐదు నెలల్లోనే 10 శాతం ఓట్ షేర్ కోల్పోయి దారుణ ఓటమిని మూటగట్టకుంది. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) 16.72 శాతం ఓట్లు సాధిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో 9.96 శాతం ఓట్లకే పరిమితమయ్యింది. ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఒక్కటే లోక్‌సభ ఓట్ల కన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శాతం ఓట్లను అధికంగా సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ 10.27 శాతం ఓట్లు రాగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 11.29 శాతం ఓట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ ఐదు శాతం ఓట్లను కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 16.92 శాతం ఓట్లు పోల్ కాగా అసెంబ్లీ ఎన్నికల్లో 12.41 శాతం ఓట్లకే పరిమితం అయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమికి 43.91 శాతం ఓట్లు రాగా అసెంబ్లీ ఎన్నికల్లో 33.66 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 10.25 శాతం ఓట్లను ఈ కూటమి కోల్పోయింది.
లోక్‌సభ ఎన్నికల్లో అన్ని ప్రాంతాలపై మహావికాస్ అఘాడీ ఆదిపత్యం ప్రదర్శిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. మహారాష్ట్రలోని కొంకణ్, నార్త్ మహారాష్ట్ర, వెస్ట్రన్ మహారాష్ట్ర, ముంబయి - థానే, మరాఠ్వాడ, విదర్భ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ మహాయుతి కూటమి స్పష్టమైన ఆదిపత్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకున్న విదర్భలోనూ మహాయుతి కూటమిదే హవా కనిపించింది. విదర్భ ప్రాంతంలో 62 అసెంబ్లీ సీట్లు ఉండగా మహాయుతి కూటమి 48 స్థానాల్లో విజయం సాధించింది. వెస్ట్రన్ మహారాష్ట్రలో 58 ఎమ్మెల్యే సీట్లకు గాను 42 సీట్లను గెలుచుకుంది. ముంబయి - థానే నగరాల్లో 54 సీట్లకు గాను 46 చోట్ల మహాయుతి కూటమి క్యాండిడేట్లు గెలుపు బావుటా ఎగరవేశారు. నార్త్ మహారాష్ట్రలో 47 అసెంబ్లీ స్థానాలుంటే కూటమి అభ్యర్థులు 44 చోట్ల విజయం సాధించారు. మరాఠ్వాడ ప్రాంతంలో 46 సీట్లుంటే 41 స్థానాల్లో గెలుపొందారు. కొంకణ్ లో 21 సీట్లుంటే 19 స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. బీజేపీ 26.77 శాతం ఓట్లతో 132 స్థానాల్లో ఘన విజయం సాధించింది. శివసేన 12.38 శాతం ఓట్లతో 57 స్థానాల్లో గెలుపొందింది. ఎన్‌సీపీ 9.01 శాతం ఓట్లతో 41 స్థానాల్లో గెలిచింది.