Telugu Global
National

కార్లు, బస్సులే కాదు హెలీక్యాప్టర్‌ ను తనిఖీ చేసిండ్రు!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అమిత్‌ షా హెలీ క్యాప్టర్‌ తనిఖీ

కార్లు, బస్సులే కాదు హెలీక్యాప్టర్‌ ను తనిఖీ చేసిండ్రు!
X

ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, కానుకలతో ప్రలోభ పెట్టకుండా ఎన్నికల అధికారులు రోడ్లపై చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తారు. వచ్చి వెళ్లే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేసి అక్రమంగా నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు, మద్యం తరలిస్తుంటే సీజ్‌ చేస్తారు. సీజ్‌ చేసిన నగదు, వస్తువులకు సరైన ఆధారాలు చూపిస్తే వాటిని విడిచి పెడుతారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇది అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ. చెక్‌ పోస్టులతో పాటు ప్రత్యేకంగా సర్వేలెన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తుంటారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్‌ షా ప్రయాణించే హెలీక్యాప్టర్‌ ను తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హింగోలి నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన అమిత్‌ షా హెలీక్యాప్టర్‌ ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోం మంత్రి వెల్లడించారు. తన అధికారిక 'ఎక్స్‌' ఎకౌంట్‌ లో తనిఖీల వీడియోను పోస్ట్‌ చేశారు. నిష్పాక్షిక, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను తాము విశ్వసిస్తున్నామని, ఎన్నికలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌ కొనసాగించడంలో మన బాధ్యతలు నిర్వర్తించాలి అని పేర్కొన్నారు.

First Published:  15 Nov 2024 5:42 PM IST
Next Story