మహాకుంభమేళా.. గణనీయంగా పెరిగిన విమాన టికెట్ ధరలు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి ప్రయాగ్ రాజ్ టికెట్ ధర ఏకంగా 498 శాతం పెరిగి రూ. 17,796 గా కొనసాగుతున్నది.
యూపీలో మహాకుంభమేళా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమానాల టికెట్ ధరలు గణనీయంగా పెరిగాయి. ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం గత ఏడాది ఈ సమయంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి ప్రయాగ్ రాజ్ టికెట్ ధర రూ. 2877గా ఉన్నది. ఆ ధర ఇప్పుడు ఏకంగా 498 శాతం పెరిగి రూ. 17,796 గా కొనసాగుతున్నది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు వన్ వే బుకింగ్‌ల సరాసరిన లెక్కగట్టడంతో ఈ మొత్తం తేలింది. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లే విమానాల టికెట్ ధర 21 శాతం పెరిగి రూ. 5748 కి చేరింది. ముంబయి-ప్రయాగ్‌రాజ్ టికెట్ ధర 13 శాతం పెరిగి రూ. 6381 గా ఉన్నది.
బెంగళూరు-ప్రయాగ్‌రాజ్ మార్గంలో విమాన టికెట్ ధరలు 89 శాతం పెరిగాయి. బెంగళూరు-ప్రయాగ్‌రాజ్ సర్వీస్‌కు రూ. 11,158 వసూలు చేస్తున్నారు. అహ్మదాబాద్-ప్రయాగ్‌రాజ్ టికెట్ ధర 41 శాతం పెరిగి రూ. 10, 364గా ఉన్నది. మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు సమీప నగరాలైన లఖ్‌నవూ, వారణాసి నగరాల టికెట్ ధరలు 3-21 శాతం పెరిగాయి.