Telugu Global
National

మహా కుంభమేళా ప్రారంభం

ఉదయమే 50 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు

మహా కుంభమేళా ప్రారంభం
X

మహా కుంభమేళా సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌ రాజ్‌ లో గల గంగా, యుమన, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమికి ప్రారంభమయ్యే మహా కుంభమేళా మహా శివరాత్రి పర్వదినంతో పరిసమాప్తం కానుంది. సోమవారం తెల్లవారుజామున్నే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఉదయాన్నే సుమారు 50 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని అంచనా వేస్తున్నారు. 45 రోజుల పాటు నిర్వహించే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు చేపట్టారు. నదిలో ప్రమాదాలు జరగకుండా బోట్లతో భద్రతా సిబ్బంది 24/7 పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. నదిలో తేలియాడేలా ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ ను సైతం ఏర్పాటు చేశారు.




ఆధ్యాత్మిక వారసత్వ సంపద : ప్రధాని నరేంద్రమోదీ

మహా కుంభమేళ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వ సంపద అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈమేరకు 'ఎక్స్‌'లో ఆయన పోస్ట్‌ చేశారు. భారతీయ విలువలు.. సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనదని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌ లో కుంభమేళాకు అంకురార్పణ జరిగిందన్నారు. భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సంగమం ఈ వేడుక అని.. ఈ వేడుక భారతీయులను ఒక్కచోటుకు చేర్చిందన్నారు. పవిత్ర స్నానాలు ఆచరించి.. దేవదేవుడి ఆశీస్సులు పొందేందుకు లెక్కలేనంత మంది రావడంతో సంతోషదాయమకన్నారు. కుంభమేళాకు 35 కోట్ల నుంచి 40 కోట్ల మంది భక్తులు తరలివస్తారని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం అంచనా వేసింది. రోజుకు కోటి మంది భక్తులు తరలివచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ వెల్లడించారు. 10 వేల ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు చేశామని, 55 పోలీస్ స్టేషన్లు ప్రత్యేకంగా నెలకొల్పామన్నారు. 45 వేల మంది పోలీసులు భద్రత ఏర్పాట్లలో పాల్గొంటున్నారని చెప్పారు.

First Published:  13 Jan 2025 9:42 AM IST
Next Story