కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా 18, 19 తేదీల్లో నిరసనలు
పిలుపునిచ్చిన వామపక్ష పార్టీల ఉమ్మడి వేదిక

దేశ ప్రజలను వంచించేలా ఉన్న కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకరంగా ఈనెల 18, 19 తేదీల్లో వామపక్ష పార్టీల ఉమ్మడి వేదిక ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. అఖిల భారత వామపక్ష పార్టీల పిలుపును రాష్ట్రంలోని అన్ని వామపక్ష పార్టీల ప్రతినిధులు విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. దేశంలోని 200 మందికి పైగా ఉన్న సంపన్నులకు పన్ను రాయితీలు కల్పించి.. దేశ ప్రజలందరిపై భారీగా పన్నుల భారం మోపారని ఆరోపించారు. బీమా రంగంలో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఎల్‌ఐసీని విదేశీ మార్కెట్ శక్తుల చేతుల్లో పెట్టడమేనన్నారు. ఉపాధి హామీ పథకం, విద్య, వైద్యం, ప్రజాపంపిణీ, ఎస్సీ, ఎస్టీలు, స్త్రీ శిశు సంక్షేమానికి బడ్జెట్ పెంచాలనే డిమాండ్లతో ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పెట్రో ఉత్పత్తులపై సర్ చార్జీ రద్దు చేసి వాటి ద్వారా సమకూరే ఆదాయంలో రాష్ట్రాల వాటా బదిలీ చేయాలన్నారు. నిరసనకు పిలుపునిచ్చిన వారిలో సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం (ఎంఎల్) మాస్‌లైన్ కార్యదర్శి పోటు రంగారావు, ఎంసీపీఐ (యు) కార్యదర్శి గాదగోని రవి, న్యూ డెమోక్రసీ కార్యదర్శివర్గ సభ్యుడు సాదినేని వెంకటేశ్వర్ రావు, చలపతి రావు, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ కార్యదర్శి జానకీరాములు, ఎస్‌యూసీఐ (సీ) కార్యదర్శి మురహరి, సీపీఎం (ఎంఎల్) లిబరేషన్ కార్యదర్శి రమేశ్ రాజా, ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి సురేందర్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) కార్యదర్శి ప్రసాదన్న ఉన్నారు.