Telugu Global
National

కృష్ణా జలాల పునః పంపిణీపై విచారణ షురూ

తెలంగాణ తరపున హాజరైన మంత్రి ఉత్తమ్‌, అధికారులు

కృష్ణా జలాల పునః పంపిణీపై విచారణ షురూ
X

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణా జలాల పునః పంపిణీపై కేడబ్ల్యూడీటీ -2 (బ్రజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్) ఎదుట వాదనలు షురువయ్యాయి. మొదటి రోజు తెలంగాణ తరపున కేడబ్ల్యూడీటీ -2 విచారణకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో 555 టీఎంసీలు తమకు చెందుతాయని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని.. తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లల్లో జరిగిన అన్యాయంపై అని తెలంగాణ ఇప్పటికే స్టేట్‌మెంట్‌ ఆన్‌ కేస్‌లో పేర్కొన్నది. తెలంగాణ తరపున ట్రిబ్యునల్‌ ఎదుట సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ కుశ్విందర్‌ వోహ్రా, అడ్వొకేట్‌ రవీందర్‌ రావు నీటి పంపకాలకు సంబంధించిన టెక్నికల్‌ అంశాలు సహా వాదనలు వినిపిస్తారు. మొదటి రోజు విచారణకు అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి, ఇరిగేషన్‌ అడ్వైజర్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సహా పలువురు ఇంజనీర్లు హాజరయ్యారు.

కేసీఆర్‌ కృషితో నీటి పంపకాల అంశం ట్రిబ్యునల్‌కు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో తెలంగాణ కు కృష్ణా నీటిలో జరిగిన అన్యాయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతనైనా నీటి పంపకాల్లో న్యాయం చెయ్యాలన్న డిమాండ్‌ ను కేంద్రం పెడచెవిన పెట్టడంతో న్యాయపోరాటం చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో సుప్రీం కోర్టులో కేసు విత్‌ డ్రా చేసుకోవాలని ప్రతిపాదించింది. కేసు విత్‌ డ్రా చేసుకోవడంతో ఇంటర్‌ స్టేట్‌ వాటర్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌ 1954లోని సెక్షన్‌ -3 కింద ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నీటి పంపకాలకు కేంద్ర ప్రభుత్వం టెర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌ (టీవోఆర్‌) జారీ చేసింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించిన 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు తెలంగాణకు దక్కాలని స్టేట్‌మెంట్‌ ఆన్‌ కేస్‌ (ఎస్‌వోసీ)ని ట్రిబ్యునల్‌ ఎదుట ఫైల్‌ చేశారు. దానికి అనుగుణంగానే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ట్రిబ్యునల్‌ ఎదుట వాదనలు వినిపిస్తోంది. జస్టిస్‌ బ్రజేశ్‌ కుమార్‌ చైర్మన్‌గా ఉన్న ట్రిబ్యునల్‌ లో రిటైర్డ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ రామ్మోహన్‌ రెడ్డి, జస్టిస్‌ తలపాత్ర సభ్యులుగా ఉన్నారు. ట్రిబ్యునల్‌ ఇరుపక్షాల వాదనలు వింటామని గురువారం వెల్లడించింది. ఫిబ్రవరి 19 నుంచి 21వ తేదీ వరకు వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.


First Published:  16 Jan 2025 5:44 PM IST
Next Story