Telugu Global
National

తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణ స్వీకారం

నవంబర్‌ 10న ముగియనున్న ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీ కాలం

తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణ స్వీకారం
X

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియమితులయ్యారు. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీ కాలం నవంబర్‌ 10న ముగియనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును సిఫార్సు చేసిన విషయం విదితమే. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో నవంబర్‌ 11న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ వెల్లడించారు. 2025 మే 13 వరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆ పదవిలో కొనసాగనున్నారు.

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1983లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన అక్కడి తీస్‌హజారీ జిల్లా కోర్టు, హైకోర్టు, ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో అక్కడే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్‌ ఖన్నా ప్రస్తుతం నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా, భోపాల్‌లోని నేషనల్‌ జ్యుడిషియల్‌ అకాడమీ పాలక మండలి సభ్యుడిగానూ ఉన్నారు.

First Published:  24 Oct 2024 9:28 PM IST
Next Story