ఝార్ఖండ్ ఎన్నికలు.. జాబితాపై కాషాయపార్టీ కసరత్తు
81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో ఆసక్తికరంగ మారిన ఎన్నికలు
ఈ ఏడాది చివరల్లో జరగనున్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాపై కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున ఇప్పటికే ఓ జాబితాను బీజేపీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నేడు (సోమవారం) పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశంలో తుది జాబితా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో మిత్రపక్షాలపై జేడీయూకు రెండు సీట్లు, ఎల్‌జేపీకి ఒక సీటు, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు తొమ్మిది సీట్లు బీజేపీ ఇచ్చే అవకాశం ఉన్నదని సమాచారం.
మాజీ సీఎం చంపయ్ సోరెన్ జేజేఎం ను వీడి కాషాయ పార్టీలో చేరిన తర్వాత ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఝార్ఖండ్ వేదికగానే ఇండియా కూటమి నేతలు బలప్రదర్శన చేశారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. మనీ లాండరింగ్ కేసులో సీఎం సోరెన్ అరెస్ట్ తర్వాత అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ యత్నించిందని జేజేఎం ఆరోపించింది.
'పిల్ మాస్టర్ గ్యాంగ్'గా బీజేపీ: కల్పనా సోరెన్
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు బీజేపీ అడ్డుపడుతున్నదని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి, ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఆరోపించారు. మహిళలకు ఆర్థిక సాయం అందించడానికి ఉద్దేశించిన ఓ పథకంపై కోర్టులో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేసిందని చెబుతూ కల్పనా ఖండించారు. రాష్ట్ర ప్రజల కోసం సీఎం హేమంత్ ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికీ ఆటకం కలిగించే 'పిల్ మాస్టర్ గ్యాంగ్'గా మారిందని బీజేపీపై ధ్వజమెత్తారు.