Telugu Global
National

జమ్ముకశ్మీర్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం

ఆఖరి దశలో 40 స్థానాల్లో బరిలో నిలిచిన 415 మంది అభ్యర్థులు. అక్టోబర్‌ 8న ఓట్ల లెక్కింపు

జమ్ముకశ్మీర్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం
X

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల పోరులో చివరి విడత పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.ఆఖరి దశలో 40 స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. ఇందులో జమ్ము ప్రాంతంలో 24, కశ్మీర్‌ లోయలో 16 స్థానాలు ఉన్నాయి. 40 స్థానాల్లో 415 మంది అభ్యర్థులున్నారు. 39.18 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. 5,060 పోలింగ్‌ కేంద్రాలలో సుమారు 20 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్‌ శరణార్థులు, వాల్మీకి సమాజ్‌, గూర్ఖా తెగలవారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు.

ఓటింగ్‌ ప్రశాంతంగా జరగడానికి భారీ ఎత్తున పోలీస్‌ బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల్లో 50 నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో 17 స్థానాల్లో పురుషులతో పోలిస్తే మహిళల ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. మూడో విడతలో మొదటి రెండు విడతల కంటే ఎక్కువ పోలింగ్‌ నమోదయ్యేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు అక్టోబర్‌ 8న ఉంటుంది.

ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయండి: ప్రధాని

జమ్ముకశ్మీర్‌లో తుది దశ పోలింగ్‌ జరుగుతున్నందున, ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని మోడీ కోరారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువతనే కాకుండా మహిళలూ పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటారని విశ్వసిస్తున్నట్లు ప్రధాని ఎక్స్‌ వేదికగా తెలిపారు.


First Published:  1 Oct 2024 3:10 AM GMT
Next Story