108 కిలోల అక్రమ బంగారం పట్టివేత
స్మగ్లింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని సోదా చేశారు.
అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని భారత భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటిని అక్రమంగా రవాణా చేస్తున్నది భారత్–చైనా సరిహద్దులో కావడం గమనార్హం. ఈ సందర్భంగా ముగ్గురు నిందితులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తూర్పు లడాఖ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
తూర్పు లడాఖ్‌లో జూలై 9వ తేదీన ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ) బలగాలు గస్తీ నిర్వహిస్తుండగా.. స్మగ్లింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని సోదా చేశారు. వారి వద్ద 108 కిలోల బంగారు కడ్డీలతో పాటు 2 మొబైల్ ఫోన్లు, ఒక బైనాక్యులర్, 2 కత్తులు, చైనాకు చెందిన కొన్ని ఆహార పదార్థాలు ఉండటాన్ని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న సిబ్బంది ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఇద్దరు నిందితులు లడాఖ్‌లోని నిన్యోమా ప్రాంతానికి చెందినవారుగా భద్రతా దళాలు గుర్తించారు.