Telugu Global
National

నేను ఎన్నికల ప్రచారానికి రాలే.. ఈ నేలపై గౌరవం తెలపడానికే వచ్చా

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

నేను ఎన్నికల ప్రచారానికి రాలే.. ఈ నేలపై గౌరవం తెలపడానికే వచ్చా
X

మహారాష్ట్రకు తాను ఎన్నికల ప్రచారానికి రాలేదని.. ఎందరో మహనీయులు పుట్టిన నేల.. సాదువులు నడిచిన నేలపై గౌవరం తెలపడానికే వచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అన్నారు. శనివారం డేగ్లూరులో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఛత్రపతి శివాజీ, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, రాజమాత జిజియా భాయ్‌ తదితరులు పుట్టిన గడ్డ ఇది అన్నారు. బాలాసాహెబ్‌ ఠాక్రేను కలిసే అవకాశం రాలేదని.. అన్యాయాలు, అక్రమాలను ఎదిరించడంలో ఆయనే తనకు బలమైన స్ఫూర్తి అన్నారు. అధికారంతో సంబంధం లేకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడి ఉండటాన్ని ఆయన నుంచి నేర్చుకున్నానని తెలిపారు. పదేళ్ల ఎన్‌డీఏ పాలనలో ఆర్టికల్‌ 370 రద్దు చేశారని, దివ్యరామ మందిరం ఇలా ఎన్నో ఘనతలు సాధించామన్నారు. దేశం నలుమూలలను కలిపే నేషనల్‌ హైవేలు, పల్లెపల్లెకు విస్తరించిన రోడ్లు ఎన్‌డీఏ హయాంలోనే నిర్మించినవి అన్నారు. పదేళ్లలో 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశామన్నారు. నాలుగు కోట్ల మంది రైతులకు పంటల బీమా, పీఎం కిసాన్‌ ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. 30 కోట్ల మంది మహిళలకు ముద్ర యోజనలో చేయూతనిచ్చామన్నారు.

హైవే మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో 11 వేల కి.మీ.ల పొడవైన రోడ్లు నిర్మించారని, నాగ్‌పూర్‌ నుంచి థానే వరకు వేసిన 710 కి.మీ.ల హైవే మహారాష్ట్ర నవ నిర్మాణంలో కీలకమని తెలిపారు. రాబోయే రోజుల్లో భారత్‌ ఐదు లక్షల ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు పాల్గర్‌ లో సాధువులను చంపేశారని, విశాల్ ఘడ్ చారిత్రక ఖిల్లాను ఆక్రమించారని, ఒక వర్గం ప్రజలను శాంతింప చేయడానికి బాధ్యులపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. సాధువులు, సంతులు, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వమే కావాలన్నారు. ఛత్రపతి శివాజీ తరహాలో మరోసారి పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశాన్ని రక్షించుకోవాల్సి బాధ్యత కూడా ప్రజలపైనే ఉందన్నారు. హైదరాబాద్‌ పాతబస్తీ నుంచి కొందరు వచ్చి 15 నిమిషాల టైం ఇస్తే హిందువులకు తామేంటో చూపిస్తామని అంటున్నారని, అలాంటి వాళ్లు తమ సహనం పరీక్షించొద్దన్నారు. సినిమాల్లో పోరాటం చేయడం చాలా తేలిక అని, నిజజీవితంలో ధర్మం కోసం నిలబడటం చాలా కష్టమన్నారు. నాందేడ్‌ లోక్‌సభ, డేగ్లూర్‌ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న మహాయుతి కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  16 Nov 2024 6:58 PM IST
Next Story