సీఎం రేసు నుంచి శిండే వైదొలుగుతున్నారా?
తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ సారాంశం అదేనని అభిప్రాయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి తరఫున సీఎం పదవి చేపట్టనున్నారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీ కాలం నేటితో (మంగళవారం) ముగియనున్నది. దీంతో ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిని అధికారులు ఖండించినప్పటికీ.. తదుపరి సీఎం అభ్యర్థి ఎవరు కాబోతున్నారనేది కూటమి ఇంకా తేల్చకోలేకపోతున్నది. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆపార్టీ హైకమాండ్‌తో పాటు రాష్ట్ర నాయకత్వం అంటుండగా.. 'బీహార్ ఫార్ములా' ప్రకారం ఏక్‌నాథ్ శిండేను కొనసాగించాలని శివసేన పట్టుబడుతున్నది. ఈ సస్సెన్స్ కొనసాగుతున్న సమయంలోనే సీఎం శిండే పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో ఆయన సీఎం రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
మంగళవారం తెల్లవారుజామున ఏక్‌నాథ్ శిండే తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. 'ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించడంతో మా ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నది. మహాకూటమిగా మేం ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం. నేటికీ కలిసే ఉన్నాం. నాపై ప్రేమతో కొన్ని సంఘాల వారు నన్ను కలవడానికి ముంబయి వస్తామని అడుగుతున్నారు. వారి అభిమానానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను. అయితే నాకు మద్దతుగా అలా ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. బలమైన, సుసంపన్న మహారాష్ట్ర కోసం మహాకూటమి బలంగా ఉన్నది. అలాగే కొనసాగుతుంది కూడా'అని శిండే రాసుకొచ్చారు. దీంతో ముఖ్యమంత్రి రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆయన సూచనప్రాయంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.