విశ్వ క్రీడల్లో భారత మహిళలు - పతకం రాకపోయినా పట్టుదల నేర్పారు
రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ల్లో భారత జట్టులో మహిళలపైనే పతక ఆశలు ఎక్కువగా ఉండడం విశేషం.
ఒలింపిక్స్ ప్రారంభమై రోజులు గడుస్తున్నాయి. ఐదు రోజులు గడుస్తున్నా ఒక్క పతకం కూడా భారత ఖాతాలో చేరలేదు. ఇక పతకం కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలో అని క్రీడాభిమానులు అంతా నిర్వేదంగా ఉన్నారు. ఆ సమయంలో మహిళా శక్తిని చాటుతూ.. మనూ బాకర్ తొలి పతకాన్ని అందించింది. హమ్మయ్య ఒక పతకం వచ్చిందని ఆనందించేలోపే మరో పతకాన్ని కూడా భారత్‌కు అందించింది. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత మహిళా అథ్లెట్ల ప్రదర్శన ఆకట్టుకుంది. మనూ బాకర్ మినహా మిగిలిన మహిళా అథ్లెట్లు పతకం సాధించడంలో విఫలమైనా.. చివరి వరకూ పోరాడి భారత క్రీడా భవిష్యత్తుకు భరోసా కల్పించారు.
మీరాబాయ్ చాను కేవలం ఒక్క కేజీ తక్కువ బరువు ఎత్తి పతకాన్ని కోల్పోయింది. వినేశ్ నిర్ణీత బరువు కన్నా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండి ఫైనల్లో పోరాడే అవకాశాన్ని కోల్పోయింది. లవ్లీనా బోర్గోహైన్ కూడా బౌట్‌లో పిడిగుద్దులు కురిపిస్తూ చెలరేగిపోయింది. నిఖత్ జరీన్, పీవీ సింధుల పోరాటాన్ని మనం అంత తేలిగ్గా మర్చిపోలేం. టేబుల్ టెన్నీస్‌లో తెలుగు తేజం శ్రీజ ఆకుల, మణికా బాత్ర, వంద మీటర్ల హార్డిల్స్ రన్నింగ్‌లో జ్యోతి యర్రాజి, గోల్ఫ్‌లో అదితి అశోక్ ఇలా చాలామంది మహిళలు ఒలింపిక్స్‌లో పోటీ పడ్డారు. అథ్లెటిక్స్, గోల్ఫ్‌లో అసలు భారత్ పాల్గొనడమే ఒక విశేషం. అందులోనూ ఆ విభాగంలో పాల్గొన్న ఈ ఉమెన్ అథ్లెట్లు అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ప్రాతినిథ్యం ఉండేలా చూశారు.
రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ల్లో భారత జట్టులో మహిళలపైనే పతక ఆశలు ఎక్కువగా ఉండడం విశేషం. ఇందులో షూటింగ్ మినహా మిగిలిన ఈవెంట్లలో భారత్‌కు పతకం రాకపోయినా.. ఈ విభాగాల్లో భారత మహిళ అథ్లెట్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. రానున్న భవిష్యత్తులో ఇది మరింత పెరిగి విశ్వ క్రీడల్లో పతక వెలుగులు విరజిమ్మితే భారత మహిళల శక్తి.. విశ్వవ్యాప్తమయ్యే అవకాశం ఉంది. ఈ పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానం ముగిసింది. అయితే ఈ ఒలింపిక్స్‌లో భారత మహిళల ప్రదర్శన చూస్తే వచ్చే లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో భారత్‌క రెండంకెల పతకాల ఆశలు నెరవేరడం పెద్ద కష్టమేమీ కాదు మరి.