Telugu Global
National

ఝార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి!

చొరబాటుదారులను తరిమికొడుతాం..పేపర్‌ లీక్‌ చేసిన వారిని తలకిందులు చేసి సరిచేస్తామన్న కేంద్ర మంత్రి షా

ఝార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి!
X

ఝార్ఖండ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న చొరబాటుదారులను తరిమికొడుతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. రాంచీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. 'సంకల్ప్‌ పత్ర' పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేఎంఎం ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సోరెన్‌ పాలనలో అక్రమ వలసదారుల సంఖ్య ఎక్కువవుతున్నందువల్ల సంతాల్‌ పరగణాలో గిరిజన జనాభా తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చొరబాటుదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చట్టం తెస్తుందన్నారు. అక్రమార్కులు ఇక్కడికి వచ్చి ఆడబిడ్డలను ప్రలోభ పెట్టి పెళ్లిళ్లు చేసుకుని అక్రమించుకుంటున్నారని షా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టకపోతే రాష్ట్ర సంస్కృతికి, ఉపాధికి, ఆడబిడ్డలకు భద్రత ఉండదన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌) ప్రవేశపెడతామని.. అయితే గిరిజనులను దానికి దూరంగా ఉంచుతామన్నారు.

పేపర్‌ లీక్‌లు ఎన్నో జరిగాయి. అది గతం. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి పేపర్‌ లీక్‌ చేసిన వారిని తలకిందులు చేసి సరిచేస్తాం. పారదర్శకమైన భర్తీ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. చొరబాటుదారులకు ద్వారాలు తెరిచారు. చొరబాటుదారుల్లో మీకు (జేఎంఎం) ఓటు బ్యాంకు కనిపించింది. చొరబాట్ల కారణంగా ఝార్ఖండ్‌ ఆదివాసీ జనాభా తగ్గిపోతున్నది. జనాభా మారుతున్నది. ఈ విషయంలో కోర్టులు అప్రమత్తం చేసినా కూడా అచేతనంగా మారారు. బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తిపలికి చొరబాటుదారులందరినీ బీజేపీ ప్రభుత్వం ఝార్ఖండ్‌ నుంచి వెళ్లగొడుతుంది. బయటి నుంచి పక్షులు కూడా కాలుమోపకుండా సరిహద్దులను పటిష్టం చేస్తామని అమిత్‌ షా అన్నారు.

ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా కూటములకు అగ్నిపరీక్షగా మారాయి. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని ఇండియా కూటమితో పాటు జైరాం మహాతో ఏర్పాటు చేసిన కూటమి బీజేపీకి సవాల్‌ విసురుతుండగా.. హిందుత్వతోపాటు జేఎంఎం నేతల అవినీతి అంశాలను బీజేపీ ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నది. హర్యానా ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ భిన్నంగా రావడంతో అదే ఉత్సాహంతో మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ల్లోనూ ఇండియా కూటమిని ఓడించడానికి బీజేపీ శ్రమిస్తున్నది. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో ఈ నెల 13, 20 న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.

First Published:  3 Nov 2024 9:12 AM GMT
Next Story