తుది శ్వాస వరకూ సిద్ధూ కోసమే పని చేస్తా
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కర్నాటక సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు తీసుకునేలా అధిష్టానం వద్ద ఒప్పందం జరిగిందని కొన్ని రోజుల క్రితం బాంబు పేల్చిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శుక్రవారం మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. తన తుది శ్వాస వరకూ సీఎం సిద్ధరామయ్య కోసం రాయిలా పని చేస్తానని శివకుమార్ అన్నారు. స్థానికంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో డీకే ఈ కామెంట్ చేశారు. మొదటి రెండున్నరేళ్లు సిద్ధూ, ఆ తర్వాత రెండున్నరేళ్లు డీకే ముఖ్యమంత్రులుగా ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నామనే అర్థం వచ్చేలా డీకే ఇటీవల మాట్లాడారు. ఆ కామెంట్స్‌పై పార్టీ హైకమాండ్ రియాక్ట్ అయ్యిందో.. తనకు తానుగానే మనుసు మార్చుకున్నారో కానీ సిద్ధూ కోసం రాయిలా పని చేస్తానని డీకే అన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత ఉన్న కార్యకర్తనని.. ఎక్కడ ఉన్నా పార్టీ కోసమే పని చేస్తానని చెప్పారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలే అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది అంటే అన్ని వర్గాలకు అధికారం దక్కినట్టేనని అన్నారు. 25 ఏళ్ల తర్వాత హాసన లోక్‌సభ ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని, ఇక్కడి మహిళలకు జరిగిన అన్యాయంపై ఒక్కరోజూ స్పందించని దేవెగౌడ తన మనవడి కోసం చెన్నపట్టణకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నందిని డెయిరీని అమూల్‌లో విలీనం చేయాలని ప్రయత్నిస్తే.. తాము నందిని బ్రాండ్ ను ఢిల్లీలో ఆవిష్కరించామని అన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఫలితం రిపీట్ అవుతుందని తెలిపారు.