Telugu Global
National

నేను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినే

చట్టాలంటే ప్రజలకు భయం, భక్తీ లేకపోవడమే దీనికి కారణమన్న కేంద్ర మంత్రి

నేను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినే
X

దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నా.. ప్రజల నిర్లక్ష్యం వల్ల బాధితుల సంఖ్య పెరుగుతున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. తానూ కూడా బాధితుడినేని చెప్పారు. చట్టాలంటే ప్రజలకు భయం, భక్తీ లేవన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు నితిన్‌ గడ్కరీ సమాధానం ఇచ్చారు. ఇక్కడ నాలుగు అంశాలు కీలకమైనవి. రోడ్డు ఇంజినీరింగ్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, సమర్థంగా చట్టాల అమలు. ప్రజలకు అవగాహన కల్పించడం. ఇక్కడ సమస్య ఏమిటంటే చట్టాలంటే ప్రజలకు భయం గానీ.. గౌరవం గానీ లేవు. రెడ్‌ సిగ్నల్‌ పడితే ఆగరు. హెల్మెట్‌ పెట్టుకోరు. నిన్నటికి నిన్న నా కళ్ల ముందే ఓ కారు రెడ్‌ సిగ్నల్‌ దాటుకుని వెళ్లిపోయింది. హెల్మెట్‌ పెట్టుకోని కారణంగా ఏటా కనీసం 30 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని గడ్కరీ వివరించారు.

నేను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినే. మహారాష్ట్రలో విపక్ష నేతగా ఉన్న సమయంలో నాకు యాక్సిడెంట్‌ అయి కాలు విరిగింది. అందుకే ఈ అంశం నాకు చాలా సున్నితమైంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో కష్టపడుతున్నా.. ఏటా 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చట్టాల అమలు సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం అన్నారు. ప్రజాప్రతినిధులు, మీడియా, సమాజం నుంచి సహకారం లేకుండా వీటిని తగ్గించడం సాధ్యం కాదన్నారు. జరిమానాలు పెంచినా ప్రజలు రూల్స్‌ పాటించడం లేదని కేంద్ర మంత్రి తెలిపారు. దీనిపై లోక్‌సభలో ప్రత్యేక చర్చ పెట్టాలని ఈ సందర్భంగా గడ్కరీ స్పీకర్‌ను కోరారు.

First Published:  5 Dec 2024 4:58 PM IST
Next Story