Telugu Global
National

ఇంటి నుంచి బైటికి వచ్చేటప్పుడు సీఎం అవుతానని తెలియదు

ప్రధాని మోడీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.శీశ్‌ మహల్‌ను మ్యూజియంగా మారుస్తామన్న ఢిల్లీకి కాబోయే సీఎం

ఇంటి నుంచి బైటికి వచ్చేటప్పుడు సీఎం అవుతానని తెలియదు
X

'ఇంటి నుంచి బైటికి వచ్చేటప్పుడు సీఎం అవుతానని నాకు తెలియదు. 48 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి వెళ్లాను. కానీ పర్వేశ్‌వర్మ నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసింది' అని ఢిల్లీకి కాబోయే సీఎం రేఖాగుప్తా మీడియాకు తెలిపారు. అలాగే మార్చి 8 నాటికి ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ. 2500 అందజేస్తామని తెలిపారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అలాగే ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పిన ఆమె.. శీశ్‌ మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు.

26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన బీజేపీ.. బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికే అవకాశం దక్కింది. బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా సీఎం లేకపోవడంతో పార్టీ హైకమాండ్‌ మహిళా ముఖ్యమంత్రివైపు మొగ్గుచూపినట్లు సమాచారం. శాలీమార్‌ బాగ్‌ నుంచి ఆమె ఆప్‌ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిన్న పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్‌ ప్రసాద్‌, ఓపీ ధన్‌ఖడ్‌ల సమక్షంలో సమావేశమైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం విదితమే. దీంతో తొలి నుంచి సీఎం పదవిని ఆశించిన పర్వేశ్‌ వర్మకు నిరాశే ఎదురైంది. మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడైన ఆయన.. ఆప్‌ అధినేత కేజ్రీవాల్ ఓడించారు. రేఖ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆప్‌ జాతీయ కన్వీనర్‌గా అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎంగా పనిచేసిన సమయంలోఓ సివిల్‌ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్‌ బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. ఆ బంగ్లాను 'శీశ్‌ మహల్‌' (అద్దాల మేడ)గా బీజేపీ అభివర్ణించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన 7 స్టార్‌ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని.. కానీ తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదని ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్‌ను ప్రధాని దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో శీశ్‌ మహల్‌ పేరు విపరీతంగా వినిపంచిన విషయం విదితమే.

రామ్‌లీలా మైదానంలో గురువారం వేలాది మంది ప్రజల సమక్షంలో సాగే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం కార్యక్రామానికి పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఎన్డీఏ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు.

ఏబీవీ నుంచి ప్రస్థానం

హర్యానాలోని జులానాలో 1974 జులై 19న జన్మించిన రేఖా గుప్తా.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్‌రామ్‌ కాలేజీలో బీకాం చదివారు. ఈ సమయంలోనే (1992) ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1996-96 లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. 1996-97లో ప్రెసిడెంట్‌గా పనిచేశారు. మేరర్‌లోని చౌధరీ చరణ్‌ సింగ్‌ వర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. 1998లో మనీశ్‌ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్‌ కౌన్సిలర్‌గా విజయంసాధించారు. అనంతరం దక్షిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఘ్‌ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. బీజేపీ నుంచి సుష్మాస్వరాజ్‌, ఉమాభారతి, వసుంధరా రాజే, ఆనందీబెన్‌ పట్‌ల తరవ్ఆత సీఎం బాధ్యతలు చేపట్టనున్న 5 వ మహిళగా, దేవంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ అతివగా రేఖా గుప్తా నిలువనున్నారు.

First Published:  20 Feb 2025 11:12 AM IST
Next Story