నేను ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిని కాను
అర్వింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రమేశ్ బిదూరి కౌంటర్
బీజేపీ సీఎం అభ్యర్థి రమేశ్ బిదూరినే అన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రమేశ్ బిదూరి కౌంటర్ ఇచ్చారు. పార్టీ బీజేపీకి అత్యంత విధేయుడినని.. ప్రజల విషయంలోనూ అంతే విధేయతతో ఉంటానని తెలిపారు. తాను సీఎం క్యాండిడేట్ అని ప్రచారం చేస్తున్నారని.. అది నిజం కాదన్నారు. రెండు సార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. ప్రజలకు సేవ చేసేందుకు పార్టీ తనకు ఈ అవకాశాలు కల్పిస్తే.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. తాను ప్రజాసేవకుడిగానే పని చేస్తానని తెలిపారు. ఢిల్లీ సీఎం అతిశీ ఇంటి పేరుతో పాటు రోడ్లను వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తామని బిదూరి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పార్టీ హైకమాండ్ అండతోనే బిదూరి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయననే బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతుందని కేజ్రీవాల్ చెప్పగా.. తాను సీఎం రేసులో లేనని బిదూరి క్లారిటీ ఇచ్చారు. ఇక సీఎం అభ్యర్థిపై బీజేపీ స్పందిస్తూ.. తమ పార్టీ ఎన్నికల చిహ్నం.. 'కమలం' గుర్తే సీఎం అభ్యర్థి అని తేల్చేసింది.