Telugu Global
National

లష్కరే తోయిబా అగ్ర కమాండర్‌ ఉస్మాన్‌ను ఎలా మట్టుబెట్టారంటే?

ఉస్మాన్‌ అంతమొందించేందుకు పక్కా ప్రణాళికతో పాటు భద్రతా దళాలకు సాయపడిన కుక్క బిస్కెట్లు

లష్కరే తోయిబా అగ్ర కమాండర్‌ ఉస్మాన్‌ను ఎలా మట్టుబెట్టారంటే?
X

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన అగ్ర కమాండర్‌ ఉస్మాన్‌ను భద్రత బలగాలు మట్టుబెట్టిన విషయం విదితమే. రెండేళ్లలో శ్రీనగర్‌లో చోటుచేసుకున్న కీలక ఎన్‌కౌంటర్‌ ఇదే. ఈ ఆపరేషన్‌ విజయం వెనుక సైన్యం వ్యూహాత్మాక ప్రణాళికే కాకుండా ఓ అసాధారణ సమస్యకు పరిష్కారమూ దాగి ఉన్నది. అదే.. వీధి కుక్కలకు బిస్కెట్లు వేయడం.

శ్రీనగర్‌లో జనసాంద్రత అధికంగా ఉన్న ఖన్యార్‌ ప్రాంతంలో ఉస్మాన్‌ దాగి ఉన్నట్లు నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కలిసి ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అప్పటికే పకడ్బందీ ప్లాన్‌ రూపొందించారు. అయితే స్థానికంగా వీధి కుక్కల సమస్య అధికంగా ఉండటం సవాల్‌గా మారింది. అవి మొరిగితే అతను అప్రమత్తమయ్యే అవకాశం ఉన్నది. పైగా ఆ పరిసరాలపై పూర్తిగా అవగాహన ఉండటంతో తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో జవాన్లు జాగ్రత్తగా వ్యవహరించారు. సమస్య పరిష్కారానికి తమ వెంట బిస్కెట్లు తీసుకెళ్లారు. వీధి కుక్కలకు ఆహారంగా వేస్తూ వాటిని కట్టడి చేశారు.

రెండు దశాబ్దాలకుపైగా ఉగ్ర కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉస్మాన్‌ స్థానికంగా అనేక దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత 2016-17 ప్రాంతంలో తిరిగి జమ్ముకశ్మీర్‌లోకి చొరబడినట్లు చెప్పారు. గత ఏడాది పోలీసు అధికారి మస్రూర్‌వనీపై కాల్పుల ఘటనలో అతని ప్రమేయం ఉందని వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు భద్రత సిబ్బందికీ గాయాలయ్యాయి. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

First Published:  3 Nov 2024 3:09 PM GMT
Next Story