Telugu Global
National

జరాంగే ఫ్యాక్టర్‌ విఫలమైందని ఎలా చెప్పగలరు?

అసెంబ్లీకి ఎన్నికైన 288 మంది ఎమ్మెల్యేల్లో 204 మంది మరాఠాలే ఉన్నారన్నమనోజ్‌ జరాంగే పాటిల్‌.

జరాంగే ఫ్యాక్టర్‌ విఫలమైందని ఎలా చెప్పగలరు?
X

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు నాయకత్వం వహించిన ఒక వ్యక్తి పేరు మారుమోగింది. ఆయనే మనోజ్‌ జరాంగే పాటిల్‌. ఆయన చేపట్టిన ఉద్యమం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో మరఠ్వాడా ప్రాంతంలో మహాయుతి కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. మరఠ్వాడాలోనూ మహాయుతి విజయ దుంధుబి మోగించింది. ఆ ప్రాంతంలోని 46 సీట్లలో 40 స్థానాలను అధికార కూటమి గెలుచుకోవడం గమనార్హం. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలపై ఆయన ప్రభావం కనిపించలేదనే వాదనలను ఆయన కొట్టిపారేశారు.

ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయలేద. పైగా ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. అలాంటప్పుడు జరాంగే ఫ్యాక్టర్‌ విఫలమైందని ఎలా చెప్పగలరు? అని ప్రశ్నించారు. నేను మరాఠా సమాజాన్ని రాజకీయ పార్టీల చెర నుంచి విడిపించాను. దీంతో వారు స్వేచ్ఛగా ఓటు వేశారు. నా దృష్టి అంతా మరాఠాలకు సాధికారత కల్పించడంపైనే ఉన్నదని జరాంగే తెలిపారు. అసెంబ్లీకి ఎన్నికైన 288 మంది ఎమ్మెల్యేల్లో 204 మంది మరాఠాలే ఉన్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తాను అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్లు గతంలో ప్రకటించిన మనోజ్‌.. తర్వాత తన ప్రయత్నాన్ని విరమించుకున్న సంగతి తెలిసిందే.

First Published:  24 Nov 2024 6:40 PM IST
Next Story