Telugu Global
National

చెన్నైలో భారీ వర్షాలు.. హోటళ్లు బుక్‌ చేసుకుంటున్న ఐటీ ఉద్యోగులు, ధనవంతులు

కార్ల పార్కింగ్‌ కోసం ప్రత్యేక సౌకర్యం, మంచినీళ్లు, కరెంట్‌ సరఫరా తోపాటు వైఫై ఉండేలా చూడాలన్న కండీషన్లతో హోటళ్లలో దిగుతున్నట్లు సమాచారం

చెన్నైలో భారీ వర్షాలు.. హోటళ్లు బుక్‌ చేసుకుంటున్న ఐటీ ఉద్యోగులు, ధనవంతులు
X

చెన్నై నగరవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజల్లో భయం నెలకొన్నది. ముఖ్యంగా ఐటీ నిపుణులు, ధనవంతులు ఖరీదైన హోటల్స్‌లో రూమ్‌లు బుక్‌ చేసుకుంటున్నారు. కుటుంబాలతో కలిసి దిగిపోతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఒక్కసారిగా భారీ వర్షాలు పడటంతో ఇళ్లలోకి నీరు చేరి, కార్లు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వాళ్లంతా హోటళ్లలో దిగుతున్నారు. కార్ల పార్కింగ్‌ కోసం ప్రత్యేక సౌకర్యం, మంచినీళ్లు, కరెంట్‌ సరఫరా తోపాటు వైఫై ఉండేలా చూడాలన్న కండీషన్లతో హోటళ్లలో దిగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం రెడ్‌ అలర్టక్ష ఇచ్చినా సాయంత్రం వరకు తేలికపాటి జల్లులే పడతంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

బెంగళూరులో స్తంభించిన జనజీవనం

మరోవైపు బెంగళూరులో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. చిక్కబళ్లాపుర, కోలారు, రామనగర, మైసూరు, చామరాజనగర, ఉడుపి, మంగళూరు, ఉత్తర కర్ణాటక, చిత్రదుర్గ తదితర జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఐటీ, బీటీ కేంద్రాలకు నిలయమైన బెంగళూరులోని మాన్యత టెక్‌ పార్క్‌ ఆవరణలో కొత్త నిర్మాణాల కోసం తీసిన పునాదుల్లో మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. నగరంలోని పలు ప్రాంతాల్లోకి వాన నీరు చేరింది. బెంగళూరు ఇందిరానగర్‌ సమీప మెట్రో మార్గంపై ఓ చెట్టు కూలడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

First Published:  17 Oct 2024 10:49 AM IST
Next Story