చెన్నైలో అతి భారీ వర్షాలు
చెన్నై నగరం, పరిసర ప్రాంతాలు అతలాకుతలం. నీట మునిగిన 300 ప్రాంతాలు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
రెండురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చెన్నై నగరం, పరిసర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. మంగళవారమూ అతి భారీ వర్షాలు పడుతాయని మొదట ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాయి. కానీ పరిస్థితులు తీవ్రం కావడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. చెన్నైవ్యాప్తంగా పలుచోట్ల 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. రెండ్రోజుల వర్షాలతో నగరం అతలాకుతలమైంది. 300 ప్రాంతాలు నీట మునిగాయి. పలు సబ్‌వేలలో మూడు అడుగుల వరకు నీరు చేరింది. మంగళవారం చెన్నైతో పాటు సమీప తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ఈ జిల్లాల్లో బుధవారం కూడా రెడ్ అలర్ట్ కొనసాగనున్నది. కార్లను ఇళ్ల ముందు ఉంచితే, వరదల్లో కొట్టుకుపోవచ్చన్న ఆందోళన చెన్నై వాసులు ఫ్లైఓవర్లపై నిలిపారు. చెన్నై-వేళచ్చేరి ప్లైఓవర్‌పై కార్లు వరుసగా కనిపించాయి. చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పేట, కాంచీపురంలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే కార్పొరేషన్లు, బోర్డులు మొదలైన వాటితో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మంగళవారం మూసివేశారు.భారీ వర్షాల కారణంగా తమిళనాడులో ఈరోజు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి.